వరంగల్ వాయిస్, కామారెడ్డి : కామారెడ్డి ఆందోళన రైతుల ఆక్రందనకు అద్దంపట్టే చర్య. ఇప్పుడు కామారెడ్డి ఒక్కటే కాదు… ఇంతకు ముందు మల్లన్న సాగర్,కొండపోచమ్మ సాగర్…ఫార్మాసిటీ, పోలవరం..అమరావతి, విశాఖ ఉక్కు, గంగవరం పోర్టు… ఇలా చెప్పుకుంటే పోతే అనేక చోట్ల ప్రభుత్వాల దౌర్జన్యం కనిపిస్తుంది. దోపిడీదారులుగా మారిన పాలకులు రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకుని వ్యాపారం చేస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు. అభివృద్ది అన్న అందమైన పేరు చూపి భూములను గుంజుకుని బక్కరైతులను బజారున పడేస్తున్న తీరు నిరంకుశ పాలనకు సాక్ష్యంగా చూడాలి. ఎంతగా అంటే వారికి ముష్టి డబ్బులు వేసి భూములను గుంజుకుంటున్న తీరు కళ్లముందు కనబడుతున్నది. రైతులు ఆక్రందనతో ఆందోళన చేస్తుంటే పోలీస్ బలగాలతో వారిని అణచివేస్తున్నారు. ఇళ్లను కూడా గుంజుకుని వారిని తన్ని తరిమేస్తున్న తీరు దౌర్జన్యానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. ఎకరా 50 లక్షలు పలుకుతోందని చెబుతున్న వారే ముష్టిగా ఎకరాకు 5 లక్షలు ఇచ్చి గుంజుకుంటున్నారు. నిజానికి పరిహారం ఇచ్చేప్పుడు రైతులకు మళ్లీ బతికేందుకు అవకాశం రావాలి. కానీ అలా జరగడం లేదు. ఊళ్లకు ఊళ్లు లేపేసినా వారి ఏడ్పులు వీరికి వినిపించడం లేదు. గతంలో మల్లన్నసాగర్,కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లింపులో పరిహాసమాడారు. ఆందోలనచేసిన రైతన్నలను చావుదెబ్బలు కొట్టించారు. జైళ్లకు తరలించారు. బేడీలు వేశారు. మల్లన్న సాగర్,కొండపోచమ్మ సాగర్‌ల రైతులు త్యాగాలు చేశారు,.. భూములను వదులుకున్నారు. ఇళ్ను, ఊళ్లను వదులుకున్నారు. కట్టుబట్టలతో బయటపడ్డ వారికి ముష్టి వేశారు. ప్రాణాలు పోతున్నా తనకేం పట్టనట్లు వ్యవహరించిన తెలంగాణ సిఎం కెసిఆర్ చిద్విలాసంతో బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కట్టానిని మురిసిపోయారు. నిజానికి వారికి సరైన పరిహారం చెల్లించి వారిని సంతోషంగా తరలించివుంటే ప్రజలు హర్షించేవారు. ప్రాజెక్టుల కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తున్న ముంపు గ్రామాల ప్రజలకు బతికే హక్కు కూడా లేకుండా చేశారు.ప్రాజెక్టు మంపు ప్రాంతాల ప్రజలకు పరిహారం అందించాలని రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తే పరిహాసమాడారు. ఈ క్రమంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోర్టు దిక్కరణ కేసులో తెలంగాన హైకోర్టు సంచలన తీర్పు వెల్లడిర చింది. ప్రభుత్వ అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించిం ది. 2018లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ విషయం లో రైతుల అభ్యంతరాలు వినకుండా అధికారులు డిక్లరేషన్, అవార్డు ఇచ్చారని కొంత మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ డిక్లరేషన్‌ను, అవార్డును రద్దు చేస్తూ హైకోర్టు గతంలోనే ఆదేశించింది. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మొత్తం రైతులందరికీ తెలపాలని, అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోని విచారణ జరిపించి, ఆర్డర్ కాపీని ప్రతి రైతుకు ఇవ్వాలని న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది. అయితే.. హైకోర్టు ఆదేశాలను పాటించకుండా డిక్లరేషన్, అవార్డు ప్రకటించారని 2019లో రైతులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించి అప్పటి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు రూ. 2000ల జరిమానా విధిం చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది గొప్ప విజయమని గమనించాలి. అయితే ప్రభుత్వానికి ఇవేవిూ పట్ట లేదు. భూసేకరణలో పరిహారం తీసుకోని 14 మంది మాత్రమే మిగిలారు, వీళ్లు ఏవిూ చేయలేరని అనుకు న్నారు. 17000 ఎకరాల భూమి తీసుకున్నాం.. కేవలం 41 ఎకరాల భూమి కోసం వీళ్లు ఏమి చేయగలరని హేళన చేశారు. రైతులను ఏమార్చడానికి ఉద్యమనేత కెసిఆర్ కూడా వెనకాడలేదనడానికి ఓ ఉదాహరణ మాత్రమే. నిజానికి పరిహారం తగినంతగా ఇచ్చివుంటే కెసిఆర్ ప్రజల మన్ననలు పొందివుండే వారు. రైతులు ఎప్పుడు కూడా ఒకరి పొట్ట కొట్టాలని చూడరు. వారి పొట్ట కొట్టాలని చూస్తే మాత్రం తిరగ
బడతారు. సమాధానం ఇస్తారు. దీంతోనైనా మార్పు వచ్చి ప్రతి ఒక నిర్వాసితునికి సంపూర్ణ న్యాయం చేస్తారని ఆశించినా.. తిరిగి అలాంటి దౌర్జన్యాలే కొనసాగిస్తున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులకు నరకం చూపించారు. ఇల్లు, వాకిలీ, భూమిని స్వాధీనం చేసుకొని, నిలువ నీడలేకుండా చేసి వేధించడం ప్రత్యేక తెలంగాణలో మాత్రమే చూశాం. తెలంగాణ ప్రభుత్వం ముంపు బాధితులకు సరైన పరిహారం, భరోసా ఇవ్వకుండా మానవత్వం లేకుండా వ్యవహరించింది. పోలవరం విషయంలోనూ ఇప్పటికీ రైతులకు న్యాయం జరగడం లేదు. అక్కడి పాలకులు చంద్రబాబు, జగన్‌లుకూడా ఇందుకు తీసిపోలేదు. నిర్వాసితులకు నేటికీ పరిహారం చెల్లించడం లేదు. వారిని బిచ్చగాళ్లు గా మార్చి రోడ్డున పడేశారు. గంగవరం పోర్టు సమయలోనూ మత్స్యకారులను తన్ని తరిమేశారు. చివరకు ఇప్పుడు గంగవరం పోర్టును ఆదానికి కట్టబెట్టారు. విశాఖ ఉక్కుకోసం రైతులు భూములు ఇస్తే వాటిని తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ భూములకు విలువ పెరగడంతో మొత్తంగా ఉక్కు ఫ్యాక్టరీనే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఇలా అమరావతి నిర్మాణం కోసం కూడా రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేశారు. వారిని బెదిరించి, కొట్టి గుంజుకున్నారు. మూడు పంటలు పండే భూములు ఇప్పుడు నిరుపయోగం చేశారు. ఫార్మా సిటీ పేరుతో ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఎకరా రెండుకోట్లు చేసే భూములను లాక్కుం టున్నారు. వారిని లాఠీలతో కొట్టించి, జైళ్లలో కుక్కి పంపిస్తున్నారు. తాజాగా కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కూడా భూములను గుంజుకోవడం వల్ల కలుగుతున్న చర్యకు ప్రతీకార చర్యగాచూడాలి. ఓ రైతు ఆత్మహత్యచేసుకున్నాడు. అయినా చీమకుట్టినట్లు లేదు. రైతు మరణాన్ని వెటకా రంగా మాట్లాడుతున్న మంత్రివర్యులు మనకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతా కన్నీటి చరిత్రే. రైతులను దగా చేయడానికే పాలకులు పుట్టారని అనుకోవాలి. భూసేకరణ విధానాలు మారాలి. రైతులకు భూమికి భూమితో పాటు పరిహారం ఇచ్చే పరిస్థితి రావాలి. ప్రభుత్వాల దౌర్జన్యాలు ఆగకుండా చేయాలి. అప్పుడే ప్రజలు బాగుపడతారు. తాజాగా కామారెడ్డితో అయినా పాలకులకు మేల్కోవాలి. కళ్లు తెరిచి రైతులకు న్యాయంచేసే విధానాలను ఆలోచించి అమలు చేయాలి. ప్రజలకు న్యాయం కోసం పనిచేయాలి. దౌర్జన్యాలకు స్వస్తి చెప్పకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.
