తమిళసైకి స్వయంగా స్వాగతం పలికిన కెసిఆర్
వరంగల్ వాయిస్, హైదరాబాద్ :రెండేళ్ల తర్వాత గవర్నర్ తమిళిసై తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టారు. గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ ఏడాది కూడా గవర్నర్ స్పీచ్ లేకుండానే సమావేశాలు నిర్వహించాలనుకున్నా చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ తమిళిసైకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. శాసనసభ, మండలి సభ్యులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ గవర్నర్ ముందుకు కదిలారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను అనుసరించారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమకు కేటాయించిన సీట్లలో నుంచి లేచి గవర్నర్ కు, ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం.. గవర్నర్ ను పోడియం వద్దకు తీసుకెళ్లారు. అందరూ జాతీయగీతం పాడారు. ఆ తర్వాత గవర్నర్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ’జై తెలంగాణ’ నినాదంతో గవర్నర్ స్పీచ్ ముగించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత సభ నుంచి వెళ్తున్న సమయంలో మండలి చైర్మన్, స్పీకర్, సీఎం కేసీఆర్, మంత్రి వేముల తమిళిసై వెంట నడిచారు.
గవర్నర్ ప్రసంగంలో గొప్పలు తప్ప.. ఏవిూ లేదు
24 గంటల కరెంట్ ఎక్కడుందో చెప్పాలి
పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదు
ధరణిపై ఎందుకు ప్రస్తావించలేదు: ఈటెల విమర్శలు
ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్‌తో చెప్పించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. పంటలు ఎండిపోతున్నాయన్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆరు గంటల కరెంట్ కూడా రావట్లేదని రైతులు సబ్ స్టేషన్లో వద్ద ఆందోళన చేస్తున్నారని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో అనేక అబద్దాలు ఉన్నాయని విూడియా పాయింట్ వద్ద ఆమాట్లాడుతూ ఈటెల మండిపడ్డారు. ధరణి గురించి ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రసంగంలో ధరణి ప్రస్తావన లేదన్న ఈటల.. ప్రభుత్వం ఇచ్చిన ప్రతిని మాత్రమే గవర్నర్ చదివారని ఆక్షేపించారు. ధరణితో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నా.. ఆ విషయంపై నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులతో మాత్రమే అర్బన్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారని చెప్పారు. గజ్వేల్ సిద్దిపేట తప్ప ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదని మండిపడ్డారు. ధరణీ, డబుల్ బెడ్ ఇళ్లు రాకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న ఈటల.. గొప్పలు చెప్పుకోడానికి మాత్రమే ఈ ప్రసంగం పనికి వస్తుందని తీవ్ర విమర్శలు చేశారు.కాగా.. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అసెంబ్లీ బ్జడెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా విలసిల్లుతోందన్న గవర్నర్.. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందిందన్నారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి, దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మిస్తున్నారని వివరించారు.
అసెంబ్లీలో అరుదైన సన్నివేశం
ఈటెలతో కెటిఆర్ సంభాషణ
హుజూరాబాద్ సభకు రాకపోవడంపై ఆరా
ప్రోటోకాల్ పాటించడం లేదన్న ఈటెల, భట్టి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ముందు బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ తో
మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వారి వద్దకు ప్రత్యేకంగా వెళ్లి మరీ ముచ్చటించారు. పలు అంశాలపై వారి మధ్య సంభాషణ జరిగింది. హుజూరాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ఈటలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించగా.. అందుకు ఆయన పిలిస్తే కదా హాజరయ్యేది అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడికి వెళ్లారు. తననూ అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని చెప్పారు. కనీసం కలెక్టర్ నుంచైనా ఆహ్వానం లేదని ఈటల తెలిపారు. ఆ తర్వాత రాజాసింగ్, కేటీఆర్ మధ్య కూడా సరదా సంభాషణ జరిగింది. కాషాయ రంగు షర్ట్ వేసుకొచ్చిన రాజాసింగ్‌ను ఉద్దేశించి కేటీఆర్ ఫన్నీ కామెంట్స్ చేశారు. చొక్కా రంగు కళ్లకు గుచ్చుకుంటుందని.. ఆ రంగు తనకుఇష్టం ఉండదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాషాయ రంగు చొక్కా భవిష్యత్‌లో విూరూ వేసుకోవచ్చేమో అని రాజాసింగ్ సరదాగా అనడం గమనార్హం. ఈ సమయంలో గవర్నర్ సభలోకి వస్తున్నారంటూ కేటీఆర్‌ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అలెర్ట్ చేయడంతో… మంత్రి తన ట్రెజరీ బెంచీల వైపు వెళ్ళిపోయారు. కాగా.. కేటీఆర్ కంటే ముందే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈటల వద్దకొచ్చి ప్రత్యేకంగా మాట్లాడారు. అయితే ఈటల, కేటీఆర్‌ల సమావేశం ప్రస్తుతం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది.

