- దేవర్షి నారద జయంతి
- పాత్రికేయులకు ఆది పురుషుడు నారద మహాముని
‘వార్తయందు జగము వర్ధిలులచున్నది యదియు లేని నాడ యఖిలజనులు సంధకార మగ్నులగుదురు గాన వార్త నిర్వహింపవలయుజతికి’ అంటాడు నారదుడు.
వార్త అంటే సమాచారమనీ నాటి అభిప్రాయం. వార్త అంటే సమాచారం, సమాచరమే విజ్ఞానం. సమాచరమే అధికారం. సమాచారం అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇటు సమాచార రంగానికి, అటు పాత్రికేయులకు ఆది పురుషుడు నారద మహాముని ఆయన సమాచారాన్ని లోక కల్యాణానికి ఉపయోగించారు. రాజసూయానికి ముందు ధర్మరాజు వద్దకు వస్తాడు నారదుడు. ధర్మరాజు రాజనీతిని బోధిస్తూ ఒక పద్యాన్ని ఉదహరిస్తాడు. ఇది ఆంధ్ర మహాభారతం సభా పర్వంలో ఉంది. పై పద్యం ఈనాటి అభిప్రాయ వార్త నిర్వహింప వలయు జతికి అంటే ఇక్కడ అర్థం రాజుకు వార్త చేరవేయాలని. ప్రజాస్వామ్యంలో సిద్ధాంతరీత్య ‘అధిపతి’ అంటే ప్రజలు కనుక ప్రజలకు వార్త అందించాలని ఆ పద్యాన్ని ఈనాటికి అన్వయించుకోవచ్చు. మరొక వైపు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి వార్త అవసరమని స్ఫురిస్తుంది. సమాచారం లేని సమాజం అంధకార బంధురం. ప్రభుత్వ సమాచారం ప్రజలకు చేర్చడానికిప్రభుత్వం పట్ల ప్రజాప్రయోజనానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి చేరేవేసి సమాచార వ్యవస్థ ప్రాచీన కాలం నుంచి ఉంది. రహస్య సమాచార వ్యవస్థ పురాతన కాలంలో క్రీ.పూ. నాల్గవ శతాబ్దంలో చాణుక్యుడు తన ‘అర్థశాస్త్రం’లో రాజులు వారి వారి ప్రభుత్వాలను పరిరక్షించుకోవడానికి శత్రురాజు ఎత్తుగడలను తెలుసుకోవడానికి గూఢచార వ్యవస్థను రహస్య సమాచారు వ్యవస్థను ఏర్పరచుకోమని సూచించాడు. అది చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించిన కాలం ఆ రోజులలో సన్యాసులను, గూఢచారులను, హస్తముద్రికులను, జ్యోతిష్యులను, విధవలను, కళాకారులను సమాచార సేకరణకు ఉపయోగించేవారు. అశోక చక్రవర్తి క్రీ.పూ. మూడవ శతాబ్దంలో శిలా శాసనాల ద్వారా ప్రజలకు సమాచారం అందించే పద్ధతి ప్రవేశపెట్టాడు. అద్భుత శిల్ప చాతుర్యంతో కూడిన పెద్ద శిలా స్తంభాలను చెక్కించి వాటిపై ధర్మసూత్రాలను రాయించాడు. రాష్ట్ర రాజధానుల్లోనూ, జనసమర్ధం గల పట్టణాల్లోనూ, యాత్ర స్థలాలు, వ్యాపార స్థలాలు ఇతర ముఖ్య పట్టణాల్లోనూ శిలా శాసనాలు నెలకొల్పాడు. ఆ శాసనాలలోని విషయాన్ని వీలైనంత ఎక్కువ మంది ప్రజల దృష్టికి తెచ్చి వారికి తెలియపర్చడమే వీటి ముఖ్యోద్దేశం. మన దేశంలో ప్రజల సమాచారానికి మూల పురుషుడు అశోక చక్రవర్తి అంటే అతిశయోక్తి కాదు. ప్రజలు నా సంతానం లాంటి వారు. నా సంతానం కొరకు ఎంత సౌఖ్యాన్ని కోరుకుంటానో అట్లే సమస్త ప్రజల సుఖ శాంతులను కూడా కోరుకుంటాను అని ఒక శిలా శాసనం అశోకుడి ఆశయాన్ని తెలుపుతుంది. రెండవ శాసనం సమాచార ప్రాముఖ్యతను తెలుపుతుంది. నేను భోజనం చేస్తున్న అంతఃపురంలో ఉన్న గోష్ఠిలో ఉన్నా, పల్లకిలో ఉన్నా, వనంలో ఉన్నా ఎక్కడ ఉన్న ఏకకాలంలో అయినా ప్రజల వృత్తాంతాన్ని వారి కష్ట సుఖాలను నాకు వేగుల వారు తెలుపుతుండ వలయును అని మరొక శిలా స్తంభం మీద ఉంది. దీన్ని బట్టి అశోక చక్రవర్తి ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని వారి సంక్షేమాన్ని తెలుసుకునే వారు. సమాచార ప్రచార మాధ్యమాలు, సమాచారాన్ని అందించే లేదా ప్రచారానికి తోడ్పడే విధానాన్ని సాధనాన్ని మనం మాధ్యమ (మీడియా)గా వ్యవహరిస్తాం. ప్రాచీన కాలంలో ఎలాంటి సాధనాలు అందుబాటులో లేని దశలో సమాచారం కేవలం మౌఖిక పద్ధతిలో ఒకరి నుంచి మరొకరికి చేరేది. అంటే నాలుగు రోడ్ల కూడలిలోనో, జనావాసాలలోనో ఒక వ్యక్తి దండోరా వేసి ప్రజలకు రాజు గారి సందేశం చదివి వినిపించే వారు. ఆ తరువాత తాలపత్ర గ్రంథాలు శిలా శాసనాలు ధ్వజస్తంభాలు, చిత్ర లేఖనాలు, నాణేలు మొదలైన వాటిని ప్రచార మాద్యమాలుగా వినియోగించారు. క్రమంగా ముద్రణ యంత్రాల ఆవిర్భావం తరువాత వార్త పత్రికలు, తదనంతరం రేడియోలు, టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్‌నెట్ ఇలా అనేక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. యుగయుగాలుగా ధర్మ రక్షణ, సమాజ సంక్షేమం, లోక కళ్యాణం కోసం సమాచార రంగాన్ని వికసింపజేసిన దేవర్షి నారదుడు పాత్రికేయుకందరికి ఆదర్శం. నారద జయంతిని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సమాచార భారతి తెలంగాణ పాత్రికేయులను గౌరవించడం సముచితంగా భావిస్తుంది.

కొలనుపాక కుమారస్వామి,
వరంగల్, మొబైల్: 99963720669