- రాజ్యాంగ విలువలు కాపాడుకోవడం మన బాధ్యత
- గాంధీ జయంతి సభలో స్పీకర్ పోచారం, మండలి ఛైర్మన్ గుత్తా
వరంగల్ వాయిస్,హైదరాబాద్: వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని గవర్నర్ తీరుపై మండలి ఛైర్మన్ గుత్తి సుకేదంర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డలు విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. శాసన మండలి, శాసన సభ, గవర్నర్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభలో వారు నివాళి అర్పించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యంగాబద్దంగా వ్యవహరిం చాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌కు ఆమోదం తెలకపోవడంతో తెలంగాణ గవర్నర్ తమిళి సై తీరుపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. అయితే అన్నీ సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని చెప్పారు. వక్రబుద్ధితో ఆలోచన చేసే వాళ్లకు మంచిబుద్ధి కలగాలన్నారు. దేశంలో మతోన్మాద శక్తులు దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు. శాంతి, సామరస్యంతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ చెప్పిన పద్ధతులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. మానవ వనరులు వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. పేదలకు మాటలతోనే కాకుండా చేతలతో సాయం చేయాలన్నారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ మాత్రమే అమలు చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్టాల్రు కూడా తెలంగాణను అనుసరిస్తున్నాయని చెప్పారు. కేంద్రం కొన్ని విషయాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వాస్తవాలను దాచలేకపోతున్నదని తెలిపారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థ, లౌకిక విధానాన్ని కాపాడు కోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు రాజ్యాంగానికి ఆటంకం కలిగిస్తున్నాయని చెప్పారు. ధనికుల ధనాన్ని పేదలకు పంచిపెడతాం అనే వ్యాఖ్యలు మాటలకు మాత్రమే పరిమితం కావొద్దని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, అహంకార ధోరణితో ఉండొద్దని మహాత్మా గాంధీ అనేవారని చెప్పారు. ప్రభుత్వాలు మారడం కాదు..ప్రజల బతుకులు మారాలన్నారు. వరుసగా రెండో సారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్‌కు ఎట్లా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్‌ను ఎందుకు నిర్వహించడం లేదని గవర్నర్ లేఖలో ప్రశ్నించారు. మరోవైపు.. సమావేశాలకు సమయందగ్గర పడుతుండటం, బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
