- జూన్ 28న జయంతి
రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పీవీకి పేరుంది. పదవిని చేపట్టినా అది ప్రజల పక్షంగానే నడిపించింది. తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామం ఆయన సొంతూరు. రుక్మిణి, సీతారామారావు తల్లిదండ్రులు. 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. పీవీ ప్రాథమిక విద్య వంగర, హన్మకొండలో సాగింది. 1936లో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులయ్యారు. 1938లో నిజాం వ్యతిరేక పోరాటంలో పీవీ పాల్గొన్నారు. దీంతో ఆనాడు రాష్ర్టంలో ఎక్కడ చదవకుండా ప్రభుత్వం నిర్భంధం విధించింది. చదువుపై మమకారంతో మహారాష్ర్టలోని పూణేలో బీఎస్సీ, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టిన పీవీ హైదరాబాద్ రాష్ర్ట ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ ప్లీడర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించేందుకు వచ్చిన పీవీ స్వామి రామానంద తీర్ద శిష్యరికంలో పీవీ 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటి సభ్యుడిగా నియమితులయ్యారు. 1952లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసిన కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. అటు తర్వాత 1957లో మొట్టమొదటి సారిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1962, 67,72 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో నిలిచి, శాసన సభ్యుడిగా విజయం సాధించారు. 1972లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాత పీవీ పని చేసిన సమయంలో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి వందలాది ఎకరాలను కలిగి ఉన్న భూస్వాముల నుంచి భూములను ఒకే చట్టం ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేట్టు చేశారు. భూస్వాముల ఆగ్రహావేశాలను లెక్క చేయకుండా భూసేకరణ చట్టం పకడ్బందీగా అమలు చేసిన ధైర్యశాలి. పీవీ స్వతాహాగా భూస్వాముల కుటుంబానికి చెందిన తన వద్ద ఉన్న 1200 ఎకరాల భూమిని వదులుకున్న ధైర్యశాలి. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో పెత్తందార్లు అడవులో వన్య మృగాలను చంపడంతో చలించిపోయి వాటి సంరక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. 1972లో భూ సంస్కరణలపై రాష్ర్ట అసెంబ్లీ సుదీర్ఘంగా చర్చించింది. జూన్ వరకు జరిగిన చర్చలను ప్రథమ సంపుటిలో ప్రచురించారు. (శాసన సభలో ప్రముఖఉల ప్రసంగాలు 2) 1972 ఆగస్టు, సెప్టెంబర్‌లలో నాటి నూతన సామాజిక పరిణామాలతో అర్ధవంతంగా సాగింది. ఈచర్చలో నాటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావుతో పాటు సభాపతి వేములపల్లి శ్రీకృష్ణా, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎం.ఓంకార్, జే.ఈశ్వరీబాయి, ఎస్.రామచంద్రారెడ్డి, ఎం.భాగిరెడ్డి, వసంత నాగేశ్వర్‌రావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, పి.జనార్దన్‌రెడ్డి, టి.పురుషోత్తమరావు, ఎం.నాగిరెడ్డి వంటి ఉద్దండులు చేసిన ప్రసంగాలలో 1 ఆగస్టు 1972 పీవీ నరసింహారావు శానససభలో ఆయన చేసిన ప్రసంగం పొందు పరుస్తూ.. ప్రజానీకం చాలా రోజులనుంచి వేచి ఉన్నటువంటి ఈ ముసాయిదా చట్టం నిన్న సభ ఎదుట ఉంచాను సభాసమితితో ప్రవేశపెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. వ్యవసాయ రంగంలో ప్రజలలో ఈనాడు భూకమతాల దృష్ట్యా ఉన్న అసమానత్వాన్ని వీలైనంత వరకు తగ్గించి ఉత్పత్తిని చిన్న చిన్న కమతలతో పెంచే అవకాశం ఇచ్చి భూమిలేని వారికి కొంత మందికి అయినా భూమి ఇచ్చే పరిస్థితిని కల్పించే ఈ ముసాయిదా చట్టం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వారేగాక దేశంలో ఉన్న అనేక రాజకీయ పక్షాల వారు నిర్నిబంధంగా ఏ విధమైన అరమరిక లేకుండా అంగీకరిస్తున్న సూత్రాలకు సిద్దాంతాలకు అనుగుణంగా ఉందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1972లో ఎన్నికలు జరిగాయి. వెనుకబడిన వర్గాలు, మైనారిటీ వర్గాలు, హరిజనులు, మహిళలకు మొత్తం సీట్లలో 60శాతం కేటాయించడంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులకు టికెట్లు లభించలేదు. ఆ ఎన్నికల్లో మజ్లిస్‌తో కలిపి ఇండిపెండెంట్లు 56 స్థానాలు గెలుచుకున్నారు. కాంగ్రెస్‌కు 213 స్థానాలు లభించగా, స్వతంత్ర పార్టీ 2, సీపై 7, సీపీఎం 1, సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి 2 స్థానాలు గెలుపొందారు. ఎన్నికల అనంతరం పీవీ నరసింహారావు తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో 1973 జనవరి 18న పీవీ రాష్ర్ట ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, రాష్ర్టంలో రాష్ర్టపతిపాలన విధించారు. పీవీ సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని భావించిన ఇందిరాగాంధీ ఆయనను 1973లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పీవీ ఈ పనిలో 1975దాకా కొనసాగారు.
ఇందిరాగాంధీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ, ఎమర్జెన్సీ తర్వాత దేశమంతటా కాంగ్రెస్ ఓడిపోయినా రాష్ర్టంలో మాత్రం కాంగ్రెస్ జెండా రెపరెపలాడించారు. నాడు రాష్ర్టంలో 42 స్థానాల్లో 41 స్థానాలు కాంగ్రెస్‌కు రావడం వెనుక పీవీ పాత్ర కీలకం. ఇందిర హయాంలో తన బహుముఖ ప్రతిభా సామర్ధాన్ని అంతర్జాతీయ దౌత్యానికి ఉఫయోగించారు. 1981లో అలీన దేశాల విదేశాంగ మంత్రుల మహాసభకు మన పీవీ అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ వ్యవహారాలలో కీలక భూమిక పోషించారు. పీవీ లోకసభ ఎన్నికల్లో హన్మకొండ, నంద్యాల, మహారాష్ర్టలోని రాంటెక్, ఒరిస్సాలోని బరంపూర్ నియోజకవర్గాలలో విజయాలు సాధించి 6,7,8,9,10,11 లోకసభలలో ప్రాతినిద్యం వహించారు. 1977, 80 ఎన్నికల్లో హన్మకొండ నుండి విజయం సాధించిన పీవీ 1984 ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి చేతిలో 54వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే ఆ ఎన్నికల్లో రాంటెక్ నుంచి విజయం సాధించిన పీవీ 1989లో కూడా రాంటెక్ నుండి విజయం సాధించారు. రాజీవ్ మంత్రవర్గంలో మానవ వనరులు, హోంశాఖ మంత్రిగా పనిచేశారు.
వృద్దాప్యంలో శరీరం సహకరించక రాజకీయాల నుండి విరమించుకుని పీవీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజీవ్ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధించింది. ప్రధానిగా పీవీ పేరును కాంగ్రెస్ పార్టీలోని అందరూ ప్రతిపాదించారు. పీవీనే ప్రధాని పదవికి అర్హుడని ఏకగ్రీవంగా మద్దతు తెలుపడంతో ప్రధాని పగ్గాలు అప్పగించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆరు మాసాల్లోపు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానిగా సమర్థంగా వ్యవహరించారు. అదే సమయంలో ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రగతి పథంల నడిపించడమే కాక భారత ప్రగతి ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పాయి. తన మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకవటం కోసం జేఎంఎం ఎంపీలకు ముడుపులిచ్చినట్లుగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కాన్నారు. నమ్ముకున్న పార్టీ నుంచి 1997 తర్వాత అనేక అవమానాలు పీవీవీ ఎదురయ్యాయి.
జీవిత చరమాంకంలో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ ఆసబీలుడి ముందు ఏ కేసు నిలవలేదు. 1996లో కూడా గెలుపొందిన పీవీ 1998, 1999 ఎన్నికల్లో పోటీ చేయలేదు. పీవీ సాధించిన విజయాలలో మచ్చుకు కొన్ని.. పీవీపై గౌరవంతో నాడు ప్రధాని ఇందిరాగాంధీ ఏకంగా ఆయన కోసమే కేంద్ర మానవ వనరుల శాఖను ఏర్పాటు చేశారు. తనకిచ్చిన గౌరవాన్ని పీవీ ప్రజల కోసం వినియోగించారు. దేశంలో అణుపరీక్షలు మొదలు పెట్టింది పీవీ సర్కారే. పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ సొంతం. పీవీ ప్రధానిగా ఉన్న కాలంలో దేశంలో ఎన్నో రాజకీయ, ఆర్థిక, సామాజిక మలుపులు చోటు చేసుకున్నాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించారు. సంస్కరణకు బీజం వేశారు. అందుకే పీవీని దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పిలుస్తుంటారు. దేశాన్ని ఏలిన ఏకైక తెలుగు వాడిగా చరిత్ర కెక్కిన పీవీ మరణం ఇటు రాష్ర్ట, అటు కేంద్ర పెద్దలను కదిలించలేదు. 2004 డిసెంబర్ 23న పీవీ మరణించారు. ఆయన అంత్యక్రియలకు ప్రాధాన్యమివ్వడంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఇది సగటు తెలుగువాడిని కలచివేసింది. (1921 – 2004)
కొలనుపాక కుమారస్వామి, వరంగల్.
సెల్: 9963720669