తిరిగి టిడిపిలో చురుకైన పాత్ర కోసం చూపు వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ దూకుడు పంచేచేస్తున్నారు. తెలుగుదేశంలో ఆయన తన పూర్వ వైభవాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గంటా తాజాగా జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా వేపాడ చిరంజీవిరావుని ఎంపిక చేసి మరీ గెలిపించుకున్నారు. అలా ఉత్తరాంధ్రాలో పార్టీకి పెద్ద బూస్టింగ్ ఇచ్చారు. దాంతో అధినాయకత్వం తిరిగి గంటా వైపు చూడక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకు అంగబలం అర్ధం బలం దండీగా ఉన్నాయి. ప్రత్యేకించి ఉత్తరాంధ్రా జిల్లాలలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. అనుచరగణం ఎటు చూసినా ఉన్నారు. ప్రత్యర్ధుల బలాలు బలహీనత విూద అవగాహన ఉంది. దాంతో పార్టీని విజయ్పధంలో కి నడిపించాలంటే గంటా లాంటి బిగ్ షాట్ అవసరం. రాజకీయాల్లో మళ్లీ కీలకమైన పాత్ర నిర్వహించాలని గంటా కోరుకుంటున్నారు. ఇటీవలి మండలి ఫలితాలతో టిడిపి బలంగా ఉందని తేలింది. దీంతో ఆయన కూడా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుంది అని భావిస్తున్నారు. దాంతో ఉభయతారకంగా ఇపుడు పరిస్థితి ఉంది. గంటాకు ఉత్తరాంధ్రా జిల్లాల బాధ్యతలను చంద్రబాబు అప్పగించవచ్చు అని టాక్ నడుస్తోంది. దాంతో గంటా మరోసారి చురుకుగా మారడం ఖాయం అంటున్నారు. గంటాను గత నాలుగేళ్ల కాలంలో బలమైన అనుచరులు వీడి వెళ్లారు. వారంతా వైసీపీ లో చేరారు. ఇపుడు గంటా తిరిగి బలమైన నాయకుడి గా టీడీపీ లో అవతరిస్తున్న వేళ వారంతా తిరిగి ఆయన వద్దకు వస్తారా అంటే రాజకీయాల్లో ఇలాంటివి జరగడం సహజం అంటున్నారు. రాజకీయ అవకాశాల కోసం అయినా చాలా మంది ఆయన బ్యాచ్ లో చేరిపోతారు అని అంటున్నారు. వైసీపీ లో ఉన్న గంటా బ్యాచ్ ని తీసుకుంటే మాజీ ఎమ్మెల్యేలు ఎస్ ఎ రహమాన్ తిప్పల గురుమూర్తిరెడ్డి తైనాల విజయకుమార్ వంటి వారు ఉన్నారు. అలాగే అనకాపల్లికి చెందిన రియల్ ఎస్టేట్ బిజినెస్ మాన్ అయిన కాశీ విశ్వనాధం వంటి వారు ఉన్నారు. అంతదాకా ఎందుకు ప్రస్తుతం విశాఖ వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ అయిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా గంటా శిష్యుడే. ఇక మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా ఒకనాడు గంటా అనుచరుడే. ఇలా విశాఖలో నే పెద్ద బ్యాచ్ గంటాకు ఉంది. వీరిలో చాలా మంది మళ్లీ వెనక్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. గంటా కూడా తన బలాన్ని పెంచుకుని టీడీపీ అధినాయకత్వం వద్ద మంచి మార్కులు సంపాదించాలని చూస్తున్నారు. అలాగే విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో కూడా గంటా అనుచర గణం మళ్లీ రీ యాక్టివ్ అవుతోంది. ఒక్కసారి గంటా చక్రం టీడీపీ లో తిరగడం మొదలెడితే సొంత పార్టీలో ప్రత్యర్ధులతో పాటు వైసీపీకి కూడా తన సత్తాను చూపిస్తారు అని అనుచరులు అంటున్నారు. గంటా కూడా తనదైన వ్యూహాలకు ప్రస్తుతం పదును పెడుతున్నారని అంటున్నారు.