
- బీజేపీ పోస్టర్లపై కార్పొరేషన్ కలర్
- ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు
- కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం
వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నాయకుల వాల్ పోస్టర్లపై కార్పొరేషన్ అధికారులు రంగు వేయడం వివాదాస్పదంగా మారింది. ‘‘బీజేపీలో చేరండి..దేశ భద్రతను కాపాడండి..డయల్ టోల్ ఫ్రీ నెంబర్ 8980808080.. జాయిన్ ఇన్ బీజేపీ’’ అంటూ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు పేరిట మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లను వేశారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లతోపాటు ప్రదీప్ రావు ఫొటోను కూడా అందులో ముద్రించారు. వరంగల్ తూర్పులో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రదీప్ రావు నియోజకవర్గంలోని సానుభూతి పరులను ఆకర్షించేందుకు ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక రాజకీయ కక్షతోనే స్థానిక శాసన సభ్యుడు నన్నపునేని నరేందర్ బీజేపీ పోస్టర్లపై రంగులు వేయించారని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అయితే ఈ రంగుల రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ చట్టం మేరకు పబ్లిక్ ప్లేసుల్లో ఇష్టానుసారంగా గోడ రాతలు, పోస్టర్లు అంటించకూడదు. ఈ కారణాన్ని చూపెట్టి మునిసిపల్ కార్మికులు వాటిపై రంగులు వేసినట్టు సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ దీని వెనుక రాజకీయ దురుద్దేశమే ప్రధానమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో కుట్ర దాగి ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ అనుచరుల ఇళ్ల వద్ద వేసిన వాటికి కూడా రంగులు పూయడమేంటంటూ బీజేపీ నాయకులు వేస్తున్న ప్రశ్నలకు మునిసిపల్ సిబ్బంది నుంచి సరైన జవాబు లభించడంలేదు. ఇతర పార్టీల, వ్యాపార సంస్థల పోస్టర్లను తొలగించకుండా, వాటిపై రంగులు వేయకుండా, కేవలం ఎర్రబెల్లి ప్రదీప్ రావు వేసిన పోస్టర్లపై మాత్రమే రంగులు వేయడంతో బీజేపీ ఆరోపణలకు జీవం పోస్తోంది. కాగా, కార్పొరేషన్ చేపట్టిన చర్యలను తమకు ఆపాదించడమేంటని నరేందర్ వర్గం ప్రశ్నిస్తోంది.
రాజకీయ కోణం..
ఇటీవల టీఆర్ ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పార్టీలో ఉండగానే నన్నపునేని వ్యతిరేక గ్రూపులో ప్రదీప్ రావు కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు బీజేపీలో చేరి ప్రత్యర్థిగా మారడంతో తూర్పు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే తన పట్టు నిలబెట్టుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్, ప్రజల్లో తన పలుకుబడిని పెంచుకునేందుకు బీజేపీ నాయకుడు ప్రదీప్ రావు చేస్తున్న కార్యక్రమాలతో నియోజకవర్గంలో రాజకీయ అలజడి నెలకొంది.
చీప్ ట్రిక్స్ తో నష్టమే..
ఈ సమయంలో ప్రదీప్ రావు అనుచరుడు రంగులు వేస్తున్న పారిశుధ్య కార్మికులకు బాధ్యుడిగా ఉన్న జవాన్ కు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవడమే కాకుండా, తమ పోస్టర్లపై రంగులు వేసిన నలుగురి ఉద్యోగాలు ఊడుతాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ప్రతిస్పందిస్తూ జవాన్ తమ ఉన్నతాధికారి ఆదేశాల మేరకే ఈ రంగులు వేశామని ఏమైనా ఉంటే ఆయనతోనే మాట్లాడాలంటూ సూచించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ తూర్పులో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హస్తముందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి తప్ప, పోస్టర్లపై రంగులు వేసి, బ్యానర్లను చించివేసే చీప్ ట్రిక్స్ తో జనాన్ని గెలుచుకోలేరని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.