వరంగల్ వాయిస్, కాజీపేట : మడికొండలోని చారిత్రక మెట్టుగుట్టపై దక్షిణ కాశీ, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారి క్షేత్రములలో పునర్వసు నక్షత్రం(శ్రీరాముని జన్మనక్షత్రం) సందర్భంగా గురువారం అర్చకులు పరాశరం విష్ణు వర్ధనాచార్యులు శ్రీ స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించి, విశేషంగా అలంకరించి తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. యాగశాలలో శ్రీ రామ మూలమంత్ర హోమం నిర్వహించారు. తదుపరి శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామి వారికి ప్రత్యేక అభిషేకములు చేశారు. ముఖ్యంగా ఈనెల 29వ తేదీ నుంచి శ్రావణ ఆగష్టు 29 వరకు శ్రావణ మాసోత్సవములు నిర్వహించబడునని, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని, అభిషేకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కే. శేషు భారతి, కే. వెంకటయ్య, అర్చకులు అభిలాష్ శర్మ, సత్యనారాయణ శర్మ, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
