- క్రయవిక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు
- యువతకు మత్తు వ్యసనాలకు బానిస కావొద్దు
- వరంగల్ సీపీ డా. తరుణ్ జోషి
వరంగల్ వాయిస్, పరకాల: పరకాల పోలీస్ స్టేషన్ పరధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ములుగు జిల్లా వెంకటపురం మండలం లక్ష్మీ దేవి పేట్ చెందిన కమ్మగాని రాంమూర్తి, కమ్మగాని చందుతో పాటు జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన బొల్లికొండ రాజయ్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీచేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను గురువారం పరకాల ఇన్ స్పెక్టర్ పి.కిషన్ నిందితులకు ఖమ్మం జిల్లా కారాగారంలో అందజేసి వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీయాక్ట్ అందుకున్న నిందితులు రెండు నెలల క్రితం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రా నుంచి భద్రాచలం మీదుగా పరకాలకు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి వీరి నుంచి 65 కేజీల గంజాయితో పాటు గూడ్స్ రవాణా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనర్ డా. తరుణ్ జోషి మాట్లాడుతూ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి రవాణా , విక్రయాలు జరిపి యువతను మత్తు పదార్థాలకు బానిసలను చేస్తే వారిపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత కూడ మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తు నాశానం చేసుకోవద్దని, ఎవరైనా గంజాయి తాగినట్లైతే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.