- ముంపు తప్పదంటున్న నిపుణులు
- అమలుకు నోచుకోని కేటీఆర్ హామీ
- ఆందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు
- బల్దియా పాలకవర్గం, అధికారులపై ప్రజల ఆగ్రహం
వరంగల్ మహా నగరానికి ఈయేడు కూడా ముంపు ప్రమాదం తప్పేలా లేదు. ప్రణాళిక లేని పనులు, పాలకులు, అధికారుల అలసత్వం కారణంగా నగరాన్ని వరదనీరు మరో మారు ముంచెత్తనుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు నగర ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మానవ తప్పిదంతో కుంటలన్నీ జనావాసాలుగా మారడంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో కుంటలను తలపిస్తున్నాయి. వరుసగా 2020, 2021 సంవత్సరాల్లో నగరంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరంగల్ నగరంలో ముంపు సమస్య లేకుండా శాశ్వత ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించి రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ బల్దియా అధికారులు మొద్దు నిద్ర వీడకపోవడం వారి పనితనానికి అద్దం పడుతోంది.
– వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రతి ఏడు వరద ముంపు వరంగల్ మహా నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. శివారు, లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటిలో చిక్కుకుని చిన్నపాటి చెరువులను తలపించేలా మారుతున్నాయి. గతంలో నగరంతోపాటు చుట్టు పక్కల ఉన్న చిన్న నీటి కుంటలన్నీ నేడు ఆక్రమణకు గురికావడంతో వరదనీరు జనావాసాలను ముంచెత్తుతోంది. దీనికితోడు నగరంలోని ప్రధాన నాళాలు కూడా ఆక్రమణకు గురికావడంతో ముంపు సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. తేలికపాటి వర్షాలకే పలు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. 2020 సెప్టెంబర్‌లో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలతో త్రినగరిలోని 45 కాలనీలు నీట మునిగాయి. దీంతో బల్దియా అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 25వేల మంది తలదాచుకున్నారు. వరద ముంపుతో వారం రోజులపాటు నగర జన జీవనం స్థంభించింది.
అమలుకు నోచుకోని మంత్రి హామీలు..
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖామాత్యులు కె.తారకరామారావు ముంపు ప్రాంతాలను సందర్శించేందుకు అక్టోబర్ 2020లో నగరంలో పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను పడవల్లో వెళ్లి పరామర్శించారు. ముంపు కుటుంబాలకు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. వరంగల్ నగరంలో ముంపు సమస్య ఉండకుండా చర్యలు చేపట్టాలని అధికారులను, పాలకవర్గాన్ని ఆదేశించారు. ఆక్రమణలో ఉన్న ప్రధాన నాళాలను క్లియర్ చేయాలన్నారు. ప్రధాన నాళాలను విస్తరించడంతోపాటు రెండు వైపులా గొడలు కట్టాలని ఆదేశించారు. ఆక్రమణలో ఎంతటి వారున్నా ఉపేక్షించకూడదన్నారు. ఇందుకు ఎన్ని కోట్లు ఖర్చు అయినా ప్రభుత్వం నిధుల విషయంలో వెనుకాడదని హామీ ఇచ్చారు.
ముందుకు సాగని పనులు..
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో బల్దియా అధికారులు ఉరుకులు, పరుగుల మీద డీపీఆర్‌లు సిద్ధం చేశారు. ముంపు నివారణకు రూ.258కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో వివిధ పనులకోసం రూ.180కోట్లను విడుదల చేశారు. దీంతో నాళాల విస్తరణకు శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో నాళాల వెంట ఆక్రమణలను తొలగించారు. ఇందులో కొందరు కోర్టులను ఆశ్రయించడంతో ఆయా ప్రాంతాల్లో పనులు పెండిరగ్‌లో పడ్డాయి. దీంతో నగరంలోని ప్రధాన కాలువల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నిధులు విడుదలై రెండు సంవత్సరాలు గడుస్తున్నా నాళాల విస్తరణ, గోడలు కట్టే పనులు నేటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి.
పూడికతీతపై నిర్లక్ష్యం..
నగరంలోని నాళాల విస్తరణ పెంచడంతోపాటు, వాటి లోతు ఎక్కువ చేయాల్సిన అధికారులు మీనమేశాలు లెక్కిస్తున్నారు. పూడికతీత విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో చాలా నాళాలు నేటికీ సిల్టుతోనే నిండుకున్నాయి. ఈ సమయంలో వర్షం పడిరదంటే చాలు నాళాల ద్వారా నీరు ప్రవహించే మార్గం లేక చుట్టు పక్కల ప్రాంతాలను వరద నీటితో ముంచెత్తుతాయి. ప్రతి ఏడు వేసవి కాలం చివరిలోనే నాళాల పూడిక తీత పనులను చేస్తుంటారు. ఈ ఏడు వీటిని కాంట్రాక్టర్‌కు అప్పగించడంతోపాటు పర్యవేక్షణను మరువడంతో ఎక్కడి సిల్టు అక్కడే పేరుకుపోయి ప్రమాదకరంగా మారింది.
2021లోనూ..
2021 ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వరదలు నగరాన్ని మారో మారు ముంచెత్తాయి. నగరంలోని 30 కాలనీలు నీటిలో మునిగాయి. లొతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. దీంతో నగరంలోని మూడు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని ముంపు ప్రాంతాల్లో వారం రోజుల పాటు జన జీవనం స్తంభించిపోయింది.
మళ్లీ అదే పరిస్థితి..
ఈ ఏడు కూడా మళ్లీ అదే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. నగరంలోని ప్రధాన నాళాల విస్తరణ నేటికీ పూర్తి కాలేదు. చాలా నాళాలకు రెండు వైపుల గోడలే కట్టలేదు. అత్యంత ప్రమాదకారిగామారిన బొందివాగు దిశను కొంతమంది రియల్టర్లు మార్చారు. బొందివాగు వెంట ఎవరికివారు ఆక్రమణలు చేయడంతో అది రోజు రోజుకు కుచించుకుపోతోంది. దీనికితోడు బెస్తం చెరువు, మద్దెలకుంట, ఉర్సు చెరువు, భట్టుపల్లి చెరువు, న్యూశాయంపేట కోటి చెరువు మత్తడి పోస్తే ఆ నీరంతా నేరుగా బొందివాగులో కలుస్తుంది. బొందివాగునుంచి వరదనీరు ప్రవహించే మార్గం లేకపోవడంతో హంటర్ రోడ్డు, ఎన్టీఆర్ నగర్, సాయి నగర్, సంతోషిమాత కాలనీ, గాయత్రి నగర్, భద్రకాళి నగర్, రామన్నపేట బీసీ కాలనీ, రఘునాథ్‌కాలని, శిరంగిరాజారాంతోట, రాజీవ్ గృహకల్ప, రంగంపేట, భద్రకాళీ రోడ్డు, సరస్వతి కాలనీ, పోతననగర్, ములుగు రోడ్డు తదితర ప్రాంతాలన్నీ జలమయంగా మారనున్నాయి. అదే విధంగా హనుమకొండలోని వడ్డేపల్లి, గోపాల్ పూర్ చెరువులు నిండితే చుట్టు పక్కల ప్రాంతాలైన జవహర్ నగర్, 100ఫీట్ల రోడ్డు, రాజాజీనగర్, సమ్మయ్య నగర్, పోచమ్మకుంట, నయీంనగర్‌కు చెందిన పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. కాజీపేట, హనుమకొండ ప్రాంతాల్లోని వరద నీరంతా నేరుగా బందం చెరువు నాళాలోకి చేరుతుంది. దీంతో ఆయా చుట్టు పక్కల ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయి.



