
అధికారుల నిర్లక్ష్యం, సకాలంలో ధాన్యం సేకరణ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రోజుల తరబడి మార్కెట్ యార్డుల వద్ద రైతులు వేచి చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో సిద్దిపేట మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని హరీశ్‌రావు పరిశీలించారు. ఇప్పటికే మార్కెట్‌లో 3,500 ధాన్యం బస్తాలు తరలించడానికి సిద్ధంగా ఉన్నా, లారీలు లేకపోవడంతో, ధాన్యం నీటిపాలైందని ఈ సందర్భంగా హరీశ్‌రావు ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న రైతులను ఓదార్చారు.
అనంతరం ఆర్డీవో, సివిల్ సప్లై అధికారులపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్‌కు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. లారీలు, హామీలను వెంటనే సమకూర్చి ధాన్యాన్ని సేకరించాలని ఆదేశించారు. లారీ అసోసియేషన్‌తో మాట్లాడి ధాన్య సేకరణకు లారీలను పంపించవలసిందిగా కోరారు.
