మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి వరంగల్ వాయిస్,హైదరాబాద్: మన ఊరు/బస్తీ`మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిందని తెలిపారు. మన ఊరు/బస్తీ`మన బడి మొదటి దశలో భాగంగా రూ.7,289 కోట్లతో 9123 సర్కారు బడులను మెరుగు పరిచామన్నారు. హైదరాబాద్ సనత్‌నగర్, కంటోన్మెట్ నియోజకవర్గాల్లో మన బస్తీ`మన బడి నిధులతో అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని 26,095 సర్కార్ బడుల రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. నాణ్యమైన బోధన, భోజనం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని వెల్లడిరచారు. ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే పిల్లలు సైతం గవర్నమెంటు బడికి వచ్చేలా సకల వసతులు కల్పించామన్నారు. గురుకుల స్కూళ్లలో ఒక విద్యార్థిపై రూ.లక్ష 25 వేలు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. విదేశీ విద్యకోసం వెళ్లే విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. స్కూళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు క్రీడలపై సిబ్బంది దృష్టిపెట్టాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరంలో సర్కారు బడుల్లో ప్రవేశాల సంఖ్య పెరిగేలా సిబ్బంది నాణ్యమైన విద్యా బోధన చేయాలన్నారు.