లోహా సభతో మరాఠ్వాడాలో బిఆర్‌ఎస్‌కు ఆదరణ వరంగల్ వాయిస్,హైదరాబాద్: బిఆర్‌ఎస్ స్థాపించిన తరవాత మహారాష్ట్రలో కెసిఆర్ నిర్వహించి మలి సభ భారీ విజయం సాధించింది. దీంతో అక్కడి, ఇక్కడి బిఆర్‌ఎస్ నేతల్లో ఉత్సాహం నింపింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనా మహారాష్ట్రలో మెల్లగా అగ్గి రాజేయడం ద్వారా బిఆర్‌ఎస్ చర్చకు తెరలేపింది. అంతేగాకుండా మహారాష్ట్ర వేదికగా బిజెపికి సవాల్ విసిరినట్లు అయ్యింది. తెలంగాణ పతకాలను ప్రస్తావి స్తూ వాటిని అమలు చేసే దమ్ముందా అని కెసిఆర్ ప్రశ్నించారు. ఇది ఓ రకంగా బిజెపి పాలకులకు సవాల్ కానుంది. ప్రజల్లో చర్చకు రానుంది. కంధార్ లోహాలో ఆదివారం బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన రెండో సభతో ప్రత్యా మ్నాయం తామే అన్న చర్చకు తెరతీసారు.ప్రలోభాలను, పోలీసుల ఆంక్షల్ని దాటి అశేషంగా జనం తరలి రావడం వివశేషం. ఓరకంగా చెప్పాలంటే జనం కేసీఆర్‌కు నీరాజనం పలికారు. అంబేద్కర్ జన్మించిన నేలన దళితబంధు లాంటి పథకం ఎందుకు అమలు కావడం లేదన్న ప్రశ్నను సంధించారు. గోదావరి, కృష్ణా నదుల పురిటిగడ్డపై కరువు ఎందుకు తాండవిస్తున్నదని అంటూ విసిరిన ప్రశ్నలు ప్రజలను ఆలోచనల్లో పడేశాయనే చెప్పాలి. ఓ రకంగా ఇది బిజెపి గడ్డపై ఆ పార్టీకి విసిరిన రాజకీయ సవాల్‌గా చూడాలి. తెలంగాణ తరహాలో మహారాష్ట్రలో కూడా రైతుబంధు సహా రైతు పథకాలను అమలు చేయాలన్న డిమాండ్‌తో ప్రజల్లో చర్చకు పెట్టారు. బిజెపి ఏలుబడిలో ఉన్న ప్రభుత్వానికి ఇది సవాల్ కానుంది. ఎకరానికి 10వేల చొప్పున రైతుబంధు, నాణ్యమైన 24గంటల కరెంటు ఫ్రీగా ఎందుకు ఇవ్వరని కూడా ప్రశ్నించారు. రూ.5లక్షల రైతు బీమా అమలు చేయాలన్నారు. పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటును మేం ఇస్తున్నాం. విూరెందుకు ఇవ్వరు? రైతులకు ప్రాజెక్టుల నుంచి ఉచితంగా సాగునీటిని అందిస్తున్నాం. అదే పని ఇక్కడ చేసి చూపగలరా?తెలంగాణలో రైతులు ఏ కారణం వల్ల మరణించినా వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు, వారి కుటుంబాలు నిలదొక్కుకునేందుకు రూ.5 లక్షల రైతుబీమా ఇస్తున్నాం. రైతులు పండిరచిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. తెలంగాణవ్యాప్తంగా దాదాపు 7వేల కొనుగోలు కేంద్రాలు తెరిచాం. మహారాష్ట్రలోనూ ఈ పద్ధతిని అమలు చేయగలరా అని ప్రశ్నించారు. రైతులతో కలిసి పోరాటం చేస్తూనే ఉంటాను. రైతుల హక్కుల కోసం బీఆర్‌ఎస్ పోరాటం ఆగదు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికీ నీళ్లు అందేవరకు బీఆర్‌ఎస్ విశ్రమించదని కూడా హావిూ ఇచ్చారు. దళితవర్గాల అభ్యున్నతే ధ్యేయంగా దళిత బంధు పథకాన్ని తెలంగాణలో తీసుకొచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ప్రభుత్వమే ఉచితంగా ఆర్థిక సహాయం చేస్తున్నది. దళితులు వారి ఇష్టానుసారం వ్యాపారాలు చేసుకోవచ్చు. తద్వారా వారు శాశ్వతంగా ఆర్థికంగా నిలదొక్కుకొనే అవకాశం కల్పించాం. ఎటువంటి బ్యాంకు లింకేజీ లేకుండా ప్రభుత్వమే దళితులకు అండగా నిలిచింది. మహారాష్ట్రలోనూ దళితబంధు పథకాన్ని తీసుకురండి. దళితులు అద్భుతంగా పురోగమించటానికి విూరు చర్యలు తీసుకోండిని కోరారు. అలాగే కాంగ్రెస్ పాలనకు, ఇప్పుడు బీజేపీ పాలనకు ఏమైనా తేడా ఉన్నదా? మన జీవితాలేమైనా మారాయా? అనేది ఆలోచించా లన్నారు. దేశంలో మహారాష్ట్రతో సహా అనేక ప్రాంతాల్లో 361 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. ఈ నిల్వలతో యావత్తు దేశానికి నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా 125 ఏండ్లపాటు ఇవ్వవచ్చు. కానీ ఎందుకు విద్యుత్తు ఇవ్వడం లేదు? భగవంతుడు పుష్కలమైన నీళ్లు, బొగ్గు ఇచ్చారు. కానీ రైతులకు అవీ ఎందుకు అందడం లేదు? గోదావరి, కృష్ణా నదులు మహారాష్ట్ర నుంచే వెళ్తాయి. కానీ ఇక్కడ తాగునీరు ఇంటింటికీ అందదు. సాగునీరు దొరకదు అన్నటువంటి ప్రశ్నలతో ప్రజల్లో ఆలచన రేకెంత్తించారు. దేశంలో 41 కోట్ల ఎకరాలకు సరిపోను పుష్క లమైన నీరు ఉన్నది. దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీల నీరు ప్రవహిస్తున్నది. ఇందులో కేవలం 19 వేల టీఎంసీల నీటిని మాత్రమే మనం వినియోగించుకుంటున్నాం. మిగిలిన 50వేల టీఎంసీలు మన కండ్ల ముందే సముద్రంలో కలుస్తున్నాయి. మన అవసరాలకు మించి నీళ్లున్నా మన రైతులు ఎందుకు నీటి కోసం తిప్పలు పడాలి? ఎందుకు వంచనకు గురికావాలన్న ప్రశ్నలు సంధించారు. మొత్తంగా మహారాష్ట్రలో ఒక చర్చను అయితే పెట్టారు. దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది మున్ముందు తెలుస్తుంది. కెసిఆర్ పర్యటన మాత్రం బిజెపికి సవాల్ లాంటిదనే చెప్పాలి. కంధార్`లోహా సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని స్థానిక ప్రజలు ఆద్యంతం ఆసక్తిగా ఆలకించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీల ద్వంద్వ విధానాలను కేసీఆర్ పూసగుచ్చినట్టుగా వివరించారు.