- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ వాయిస్, తొర్రూరు : మోసపూరిత మాటలతో రైతులను ఆగం చేస్తూ పరిపాలన చేతకాక కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకుపడ్డారు. తొర్రూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రైతులు ఎంతైనా వడ్లు పండించుకోండి రూ. 500 బోనస్ ఇచ్చి కొనే బాధ్యత నాది అని సరిగ్గా నెల రోజుల క్రితం ఏప్రిల్ 21న నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత సన్న వడ్లు పండించిన వారికి మాత్రమే రూ. 500 బోనస్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అన్నారు. తెలంగాణలో 90 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు మాత్రమే సాగు చేస్తారు. కేవలం 10 శాతం మంది రైతులు మాత్రమే వారి కుటుంబ అవసరాల కోసం సన్న వడ్లు పండించి మిగిలింది అమ్ముకునే వారు ఉన్నారు. నేడు అధికారంలోకి రాగానే కేవలం సన్నబడ్లకు మాత్రమే మద్దతు ధర ఇస్తామని అనడం వారి బోగస్ మాటలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నించే గొంతుక నేను అని మాయమాటలు చెప్పి బ్లాక్ మెయిల్ దందాలకు తెరలేపి డబ్బులు వసూలు చేసిన తీన్మార్ మల్లన్నకు ఇప్పడు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తమ విలువైన ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 56 కేసులను వెనకేసుకున్న ఒక క్రిమినల్ తీన్మార్ మల్లన్న మన పట్టభద్రుల ఎమ్మెల్సీగా అర్హుడా..?, లేక దేశ ప్రముఖ విద్యా సంస్థ బిట్స్ పిలానీలో చదివి ఉన్నత విద్యావంతుడిగా సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఒక విజనరీ నాయకుడు రాకేష్ రెడ్డి మన పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆర్హుడా…? అనేది పట్టభద్రులు ఆలోచించాలని కోరారు. ఆలోచించి…మరో నలుగురితో చర్చించి భారత రాష్ట్ర సమితి నిలబెట్టిన ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలపించాలని పిలుపునిచ్చారు.
