- తమిళ్ అమ్మడి తైతక్కలు..!
- మతితప్పి రైలులో హల్చల్..!!
- లాప్ టాప్ కిందేసి విచిత్ర విన్యాసాలు
- బోగీ ల్లోని ప్రయాణికుల గుండెల్లో రైళ్లు
- రైల్వే టికెట్ కలెక్టర్ పై దాడి
- రైల్వే పోలీసులకు చుక్కలు..
- అదుపునకు ఖాకీల విఫలయత్నం..
- పరుగెత్తే గాడీలో కళ్ళకు కట్టే సినిమాటిక్ సీన్
- ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ లో జరిగిన యధార్థ ఘటన
వరంగల్ వాయిస్, (సామల సూర్యప్రకాశ్, సీనియర్ జర్నలిస్ట్)
ఆ రైలు…!
ఎప్పటిలాగే…!!
సికింద్రాబాద్ – గుంటూరు మధ్య పరుగులు పెట్టేందుకు రెడీ అయింది…!!!
ప్రయాణీకుల హడావుడి మధ్య సోమవారం నిర్దేశించిన సమయం కంటే 16 నిమిషాలు ఆలస్యంగానే సికింద్రాబాద్ నుంచి బయలుదేరింది ఈ సూపర్ ఫాస్ట్ రైలు నెంబరు 12706. ఆ తరువాతే షురూ అయింది అసలు ఘటన.. ప్రత్యక్ష సాక్షులు.. ప్రయాణీకులు.. పోలీసుల సమాచారం మేరకు ఈ సినీ ఫక్కీ పూర్వాపరాల్లోకి వెళ్లితే పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి..
ఈ రైలు ఇంజిన్ నుంచి మూడో బోగీ ‘201821/C’. ఇది ‘జనరల్ ‘ కావడంతో జనం రద్దీ బాగానే వుంది. ఉన్నట్టుండి కంపార్ట్మెంట్ లో ఒక్కసారిగా అలజడి.. ఓ మహిళ లేచి తాను ‘తమిళ్ అమ్మడు’ గా చెప్పుకుంటూ చిత్ర విచిత్ర విన్యాసాలకు శ్రీకారం చుట్టింది. తొలుత ప్రయాణీకులెవరు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సదరు తమిళ అమ్మాయి వ్యక్తిగత దూషణల పర్వానికి శ్రీకారం చుట్టడం ఆ బోగీలోని ఎవరికీ మింగుడు పడలేదు. ఒక్కొక్కరుగా అక్కడి నుంచి తప్పుకొని పక్క కంపార్ట్మెంట్ లోకి తరలిపోయారు. అయితే, ఈ రైలు ఉదయం 10 గంటలకల్లా కాజీపేట చేరుకుని వరంగల్ దిశగా పరుగులు పెడుతోంది. అప్పటికే ఆ బోగీలో ఉన్న రిటైర్డ్ పోలీసు అధికారి ఆమెను సముదాయించేందుకు యత్నించి విఫలమయ్యారు. ఆయన చేసేదేం లేక తన సీటు వదలి వేరే సీటులోకి మారిపోయారు. అయినా సదరు తమిళ అమ్మాయి విడిచిపెట్టకుండా పోలీస్..పోలీస్..అంటూ వ్యంగ భాషతో ఆయనను మాటలతో హింసించడం నచ్చని తోటి ప్రయాణీకులు అమెకు అడ్డుపడ్డారు. అంతే… ఆమె విశ్వరూపం చేపట్టడంతో అక్కడే ఉన్న మహిళా ప్రయాణీకులు సైతం తమ పిల్లలతో సీట్లు వదలి బోగీలో పరుగులు పెట్టి ..అటూ ఇటుగా పారిపోయారు.
మూడు భాషల్లో..
తమిళమ్మాయి మతి తప్పి వ్యవహరిస్తున్నదని అందరూ అనుకుంటున్న తరుణంలో ఒక్క సారిగా.. ఇంగ్లీష్.. తెలుగు.. తమిళ్ ఇలా మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ అక్కడున్న ప్రతి ఒక్కరిపై విరుచుకు పడింది. తన వద్ద ఉన్న లాప్ టాప్ ను బోగీలో కిందేసి తొక్కుతూ.. దానిపై నృత్యాలు చేయడం అందరికీ విస్మయం కలిగించింది. అంతటితో సరిపెట్టకపోగా.. తన వద్ద ఉన్న పెన్నుతో తోటివారి భుజాలపై పొడవడం.. తలలపై ఒక్కసారిగా చేతులతో తడుతూ ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని ఎవరూ మరువలేకపోతున్నారు.
ఇటు ఆర్పీఎఫ్..అటు రాష్ట్ర పోలీస్..
తమిళ అమ్మాయి చేష్టలు మితిమీరిపోవడం.. అంతకంతకూ శృతిమించి రాగాన పడడంతో ప్రయాణికుల్లో కొందరు రైల్వే.. సివిల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే నడుస్తున్న రైలులోనే రంగంలోకి దిగి జాయింట్ ఆపరేషన్ చేపట్టడమే కాకుండా, తమిళ్ అమ్మడి అల్లరికి పగ్గాలు వేసేందుకు విఫలయత్నం చేశారు. ఆమె మాత్రం ఎలాంటి జంకు లేకుండా ఖాకీలనే బెదిరించి రైలు కిటికీల నుంచి దూకుతా.. అంటూ నానా యాగీ చేయడం విశేషం.
మానుకోటలో నిలదీత..
మహబూబాబాద్ నుంచి డోర్నకల్.. ఖమ్మం వంటి ప్రధాన రైల్వే స్టేషన్ లలో ఖాకీలను ఉన్నతాధికారులు అలర్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయినా ప్రయాణీకుల భయాందోళనలు తగ్గించలేకపోగా.. కనీసం ఆమె తిట్లు.. శాపనార్థాలు.. వ్యక్తిగత హింస, దౌర్జన్యాలను నిలువరించలేకపోయారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కు ఇంటర్సిటీ రైలు ఉదయం 11.09 నిమిషాలకు చేరుకోగానే.. ముగ్గురు మగ పోలీసులు తమిళ్ అమ్మడు హల్చల్ చేస్తున్న బోగీలోకి ప్రవేశించి ఆమెను నిలదీశారు. ప్రయాణీకుల వాగ్మూలం తీసుకుని ఆమెను అదుపుచేసేందుకు యత్నించి చేతులెత్తేశారు. ఆమె ఆంగ్ల..తమిళ్ భాషల తిట్లను తట్టుకోలేకపోయారు. పైగా ఒక్క మహిళా పోలీసు కూడా వాళ్ళ బృందంలో లేకపోవడంతో అర్థాంతరంగా రైలు దిగి దండం పెట్టడం విమర్శలకు తావిచ్చింది. ఇంకేం.. ఇక ఆమె పైత్యం మరింత పెరిగింది. తోటి ప్రయాణీకుడు అని కూడా చూడకుండా ఉమ్మివేయడం.. కొట్టడం మొదలు పెట్టడంతో అందరిలో ఆందోళన కనిపించింది.
సీనియర్ అధికారుల రంగప్రవేశం..
ఇక రైలు డోర్నకల్ చేరే వరకు ఏం చేయలేని దుస్థితి.. దీంతో డోర్నకల్ కు రైలు 11.33 గంటలకు చేరుకోగానే సీనియర్ అధికారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారు లోపలి పరిస్థితిని సమీక్షించి రైల్వే ఉన్నతాధికారులకు సీరియస్ సమాచారం ఇచ్చి అందరినీ అలెర్ట్ చేశారు. దీని వల్ల అటు మానుకోట.. ఇటు డోర్నకల్ స్టేషన్ లలో కేవలం ఒక్క నిముషం ఆగాల్సిన ఇంటర్సిటి రైలు 5 నిమిషాల చొప్పున అదనంగా ఈ రెండు స్టేషన్లలో నిలిచి పోయింది.
పాపం టికెట్ కలెక్టర్…
అసలు ఈ మతిస్థిమితం లేని అమ్మడికి ప్రయాణించేందుకు టికెట్ ఉందో.. లేదో.. చెక్ చేసేందుకు వచ్చిన రైల్వే టికెట్ కలెక్టర్ ను ముప్పతిప్పలు పెట్టడం అందరికీ నవ్వు తెప్పించింది. మంచి కోటు వేసుకుని ఫుల్ డ్రెస్ లో ఉన్న ఆయన షర్ట్ పట్టి వదలిపెట్టకుండా గుంజుతూ హడలెత్తించడం గమనార్హం. పాపం..సదరు టికెట్ కలెక్టర్ తన కోటు ను ఆ అమ్మాయి చేతుల్లోనుంచి విడిపించుకునేందుకే నానా తంటాలు పడి…బతుకు జీవుడా ..అంటూ పలాయనం చిత్తగించాల్సి వచ్చింది.
ఖమ్మంలో హైటెన్షన్.
ఖమ్మంకు రైలు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు చేరుకోగానే…పకడ్బందీగా ప్రయాణీకుల రూపంలో రంగంలోకి దిగిన మహిళా పోలీసులు.. సివిల్..రైల్వే పోలీసులు బోగీని ఒకవైపు ప్రయాణీకులు రాకుండా బ్లాక్ చేసి.. తమిళ అమ్మాయిని పట్టుకోవడం పెద్ద ఎత్తున గందరగోళానికి దారి తీసింది. ఆమె అదుపులోకి రాకపోగా మహిళా పోలీసు ఉన్నతాధికారితో పాటు యూనిఫాం, మఫ్టీ మహిళా పోలీసులు ఆరుగురు ఉన్నా ఆమెను బంధించలేకపోవడం 10 నిమిషాలు రైల్వే స్టేషన్ లో గందరగోళం సృష్టించింది. బోగీలో పరుగెత్తి తప్పించుకోవడం..సివిల్..రైల్వే పోలీసుల మధ్య వాగ్వాదంకు కేంద్ర బిందువుగా మారింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుని తమిళ అమ్మడిని వదలివేయడంతో ఖాళీగానే ఆ బోగీ ఖమ్మం నుంచి గుంటూరు వైపు పరుగులు పెట్టడం రసవత్తర చర్చకు దారితీసింది. ప్రయాణీకులకు ఇబ్బందిగా మారి అందరినీ హడలెత్తించిన ఆ మతిస్థిమితం లేని మూడు భాషల హింసోన్మాది విజయవాడ – గుంటూరు మధ్య ఎక్కడికి చేరిందో రైల్వే అధికారులకే ఎరుక…!