దగ్గరకొస్తున్న వినాయక చతుర్థి
పలు ప్రాంతాల్లో ప్రారంభమైన విగ్రహాల తయారీ
పీఓపీ విగ్రహాలకే తయారీదారుల మొగ్గు
చెరువుల నీటిని కలుషితం చేస్తున్నా పట్టించుకోని యంత్రాంగం
ముందస్తు అవగాహన కల్పించడంలో బల్దియా విఫలం
మట్టి విగ్రహాలనే వాడాలంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు
గ్రేటర్ తీరును ఎండగడుతున్న పర్యావరణ ప్రేమికులు
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తోపాటు వివిధ రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన విగ్రహాలు పర్యావరణాన్ని పాడుచేస్తున్నాయి.. చెరువుల్లోని నీరు కలుషితం అవుతుండడంతో వాటిలో నివసించే జీవ జాతులు అంతరించిపోతున్నాయి.. అందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను మాత్రమే పూజిస్తామంటూ ప్రతీనబూనాలి.. ఇదే అన్నివిధాలా శ్రేయస్కరం.. ఈ రోజు మనం నిర్మించే సమాజమే మన భావితరాలకు స్వేచ్ఛా వాయువులను ఇస్తుంది.. అంటూ ప్రతి
యేడు వినాయక చవితి పండుగ సమయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, బల్దియా సిబ్బంది ఊదరగొట్టే ఉపన్యాసాలు చేస్తుంటారు. కాని ఆచరణలో ఎక్కడా కనిపించదు. కోర్టులు వద్దంటున్నా, పర్యావరణ ప్రేమికులు అడ్డుపడుతున్నా తయారీదారులు
మాత్రం పీఓపీ విగ్రహాలకే మొగ్గు చూపుతున్నారు. తయారీదారులకు, ప్రజలకు
అవగాహన కల్పించాల్సిన బల్దియా పాలకులు, అధికారులు ప్రేక్షక పాత్ర
వహించడంపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు.
ప్రకృతిని దైవంగా పూజించే మన దేశంలో అదే ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా వినాయక చవితి పర్వదినాన్ని నిర్వహించుకోవడంపై వన ప్రేమికులు, పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. అందంగా కనిపించాలన్న లక్ష్యంతో నిషేదిత రసాయనాలను లెక్కకు మించి వాడుతూ పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులు వద్దంటున్నా, పర్యావరణ ప్రేమికులు అడ్డుపడుతున్నా తయారీదారులు మాత్రం పీఓపీ విగ్రహాలకే మొగ్గు చూపుతున్నారు. కక్కుర్తి పడిన అధికారులు వారికి సహకరించడంతో నగరంలో లెక్కకు మించి వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఎవరూకూడా కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినియోగిస్తూ విగ్రహాలను తయారు చేస్తున్నారు.
పీఓపీ విగ్రహాలకే తయారీదారుల మొగ్గు..
బల్దియానుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నగరంలో పదుల సంఖ్యలో విగ్రహ తయారీదారులు ప్రత్యేకంగా గుడారాలు వేసుకొని వినాయక విగ్రహాలక తయారీకి శ్రీకారం చుట్టారు. అందంగా కనిపించడంతోపాటు ఎక్కువ ధర పలుకుతుందన్న ఆశతో తయారీదారులందరూ పీఓపీ విగ్రహాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారులు, పాలకులు నిత్యం వాటి ముందునుంచే సంచరిస్తున్నా విగ్రహాల తయారీ విషయంలో శ్రద్ధ చూపకపోవడంపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు అవగాహన శూన్యం..
ఇప్పటికే నగరంలో పెద్ద పెద్ద గుడారాలు వేసుకొని వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. వీరికి అవగాహన కల్పించడంలో వరంగల్ మహా నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైంది. విగ్రహాల తయారీకంటే ముందుగానే వీరికి అవగాహన కల్పిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది కాని విగ్రహాలన్నీ తయారు చేసిన తర్వాత అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కళ్లముందే వేలాది పీఓపీ విగ్రహాలు విక్రయిస్తున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.
కలుషితమవుతున్న నీరు..
పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం పేరటి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతోంది. కాని నీటి కాలుష్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న వాదనలు వినిస్తున్నాయి. పీఓపీతో చెరువుల్లోని నీరంతా కలుషితం కావడంతో అందులో నివసించే వేలాది జీవ జాతులు మృత్యువాత పడుతున్నాయి. గత సంవత్సరం పద్మాక్షి గుండంలోని నీరు వినాయక విగ్రహాల నిమజ్జనంతో కలుషితంగా మారి లక్షల రూపాయల విలువ చేసే చేపలు మృతి చెందాయి. ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారమే లేసింది.
ఉమ్మడి జిల్లాలో
15వేలకు పైనే విగ్రహాలు..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏడు 15వేల విగ్రహాలకు పైగానే విక్రయాలు జరుగుతున్నాయి. విగ్రహాల సైజును బట్టి పెద్ద పెద్ద మండపాలు ఏర్పాటు చేసి భారీ ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ స్థానికంగా ఉన్న చెరువులు, కుంటలు, కాలువల్లో నిమజ్జనం చేస్తున్నారు. వరంగల్ మహా నగర పరిధిలో తొమ్మిది ప్రాంతాల్లో వినాయకుల నిమజ్జనానికి ప్రతి ఏడు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని బందం చెరువు, పద్మాక్షి గుండం, సిద్దేశ్వర గుండం, రంగ సముద్రం (ఉర్సు చెరువు), బెస్తం చెరువు, గుండు చెరువు, చిన్నవడ్డెపల్లి చెరువు, కోట చెరువు, కట్టమల్లన్న చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిగా విగ్రహాలను ఈ చెరువుల్లో నిమజ్జనం చేయడంతో ఇక్కడి నీరు కలుషితం అవుతుందని, చేపలు బతికే అవకాశం లేకుండా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మత్స్య పరిశ్రమను అభివృద్ది చేస్తామని ప్రభుత్వం చెబుతున్న ప్రభుత్వ ఆ దిశగా అడుగులు వేయడంలేదన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి.
జీహెచ్ ఎంసీలో పీఓపీ విగ్రహాలన నిషేదం..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తోపాటు వివిధ రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించరాదంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయరాదంటూ గత సంవత్సరం రాష్ట్ర హైకోర్టు నిమజ్జనానికి నాలుగు రోజుల ముందు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆందోళనకు గురైన ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్పందించిన సుప్రీం కోర్టు ఇదే చివరి అవకాశం అంటూ నిమజ్జనానికి అనుమతి మంజూరు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడు మొదటినుంచి పీఓపీ విగ్రహాల నిషేదంపై జీహెచ్ ఎంసీ దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను పూజించేలా ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతోంది. వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలోకూడా జీహెచ్ ఎంసీ మాదిరిగానే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి పర్యావరణానికి హాని కలిగించే పీఓపీని వాడకుండా చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.