- రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
- మంత్రి సిదిరి అప్పలరాజు సవాల్
వరంగల్ వాయిస్,శ్రీకాకుళం: తనపై వస్తున్న భూ అక్రమణలపై మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటుగా స్పందించారు. తాను గానీ, తన అనుచరులు గాని ఎక్కడైనా ఇంచ్ భూమి ఆక్రమించామని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన టీం తప్పు చేసినా తాను తప్పు చేసినట్టే అని అన్నారు. పలాస నియోజకవర్గ పరిధిలో భూ ఆక్రమణలపై మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి స్పందన కార్యక్రమం నిర్వహించారు. టిడిపి నాయకులు 600 కోట్ల రూపాయల విలువ గల భూములు కబ్జా అయ్యాయని విూడియా ముందు పదేపదే చెబుతున్నారు. ఆక్రమణ జరిగితే స్పందన కార్యక్రమంలో ఎందుకు ఫిర్యాదు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. తన అనుచరులపై ఎవరైన ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజకీయాలకు దూరంగా ఉండే తన భార్యపై కూడా ఆరోపణలు చేస్తూ రాతలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీదిరి అప్పల్రాజు. ఇకపై ఎవరైన పిచ్చిపిచ్చిగా రాతలు రాస్తే సహించేది లేదన్నారు. దొంగ దొంగ అని అరుస్తున్న వారే దొంగలు. టిడిపి నాయకులే ఎక్కువగా భూ ఆక్రమణలు చేస్తున్నట్లు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2012లో 1500 కోట్ల రూపాయల విలువైన భూమి ఆక్రమించానని ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. అప్పుడు ఎమ్మెల్యే గౌతు శివాజీ, ఆ సమయంలో తనకు రాజకీయాలు తెలియవు, డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసుకుంటున్నానని మంత్రి వివరించారు. గౌత శివాజీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలాసలో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉండేది కాదు, నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని సీదిరి అప్పల్రాజు మండిపడ్డారు.