సీతారామ కళ్యాణానాకి భారీగా ఏర్పాట్లు వరంగల్ వాయిస్,భద్రాచలం: శ్రీసీతారామలు కళ్యాణ ఉత్సవానికి భద్రగిరి కల్యాణ శోభను సంతరించుకున్నది. ఏటా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారామచంద్రస్వామి కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాములోరి కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి నేపథ్యంలో భక్తుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేశారు. దక్షణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములోరి కల్యాణ క్రతువులో ఆ మూడు రోజులే కీలక ఘట్టాలు. అలాంటి మధుర ఘట్టాలను తిలకించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 30న జరగనున్న రామయ్య కల్యాణానికి వేదికను ముస్తాబు చేసారు.వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఏటా రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు తరలి రానున్నారు. గురువారం రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. సుప్రభాత సేవ,తిరువారాధన నివేదన, శాత్తుమురై, మూలవరులకు అభిషేకం, అలంకారం, తరవాత మధ్యాహ్నం వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం, కల్పిస్తారు. 8 నుంచి 9 గంటల వరకు శ్రీస్వామివారికి ధ్రువమూర్తుల తిరుకల్యాణం చేస్తారు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు శ్రీసీతారామ ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా కల్యాణ మంటపానికి తీసుకెళ్తారు. 10:30 నుంచి 12:30 గంటల వరకు కల్యాణ మంటపంలో సీతారాముల తిరుకల్యాణం నిర్వహిస్తారు. . మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట వరకు ఉత్సవ మూర్తులను కల్యాణ మంటపం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. 1 నుంచి 2 గంటల వరకు మధ్యాహ్నిక ఆరాధన, రాజభోగం, 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం ఉంటుంది. శుక్రవారం సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 4 నుంచి 4:30 గంటలకు తలుపులు తీస్తారు. సుప్రభావత సేవ, 4 నుంచి 6:30 గంటలకు ఆరాధన, నివేదన, శాత్తుమురై, 6 నుంచి 9:30 గంటల వరకు సర్వదర్శనం, 9:30 నుంచి 10:30 గంటల వరకు శ్రీసీతారామ ఉత్సవ మూర్తులకు ఆలయం నుంచి ఊరేగింపు, కల్యాణ మంటపానికి తీసుకెళ్తారు. 10:30 నుంచి 12:30 గంటల వరకు మహాపట్టాభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు ఉత్సవ మూర్తులను కల్యాణ మంటపం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. శుక్రవారం కల్యాణ మంటపంలో మహాపట్టాభిషేకం జరగనున్నది. జంటకు వెయ్యి రూపాయలు ప్రవేశ రుసుం నిర్ణయించారు. మిగిలిన సెక్టార్ల అన్నింటిలో ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. భక్తులకు కల్యాణ మంటంలో మంచినీరు, మజ్జిగ ఉచితంగా ఇస్తారు. యాత్రికులు గోదావరిలో స్నానాలు చేసేందుకు హద్దులు దాటి లోపలి వెళ్లరాదు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిన్నపిల్లల జేబులో చిరునామా, ఫోన్ నంబర్లు చిట్టీలను ఉంచాలని పోలీసులు సూచించారు. తప్పిపోయిన పిల్లల విచారణ లేక పోలీస్, సమాచార కేంద్రాలు, చిన్నారుల కేర్ సెంటర్లలో అప్పగించాలన్నారు. గతంతో పోలిస్తే భద్రాచలం రూపురేఖలు మారిపోయాయి. ఈ సారి కల్యాణానికి భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మిథిలా ప్రాంగణానికి చేరుకునేలా సమాచార శాఖ రూట్‌మ్యాప్‌ను అందుబాటు లోకి తీసుకొచ్చింది. పార్కింగ్ స్థలాలను గుర్తించేలా ఏర్పాట్లు చేసింది. తలంబ్రాలు, ప్రసాద కౌంటర్లు సిద్ధం చేసింది. బస్సులు, రైళ్ల వివరాలను విడుదల చేసింది.