- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, కొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైతే.. ధాన్యం పోయడానికి కూడా స్థలం లేదన్నారు సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి.
వరంగల్ వాయిస్, తొగుట : ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గు చేటని సొసైటీ చైర్మన్ కే హరికృష్ణా రెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రమైన తొగుట వ్యవసాయ మార్కెట్‌లో పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోళ్లు గత 15 రోజులుగా నిలిచిపోవడంతో రైతులతో కలిసి పొద్దు తిరుగుడు ధాన్యాన్ని పరిశీలించారు.
15 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. పొద్దు తిరుగుడు ధాన్యంతో మార్కెట్ ముందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్ కే హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కోడ్‌లో గత నెల 3న తొగుటలో పొద్దుతిరుగుడు కేంద్రాన్ని ప్రారంభించారని, కేవలం 3300 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి గత నెల 21 వరకే నిలిపి వేయడం జరిగిందన్నారు. కేసీఆర్ హయాంలో చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, కొద్ది రోజుల్లో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైతే.. ధాన్యం పోయడానికి కూడా స్థలం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు ప్రారంభించి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కోరారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలన్నారని, వారు కోరుకున్న మార్పు వొచ్చిందన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ఎరువులు, విత్తనాలు, కొనుగోళ్ల కోసం, సాగునీరు, తాగునీరు కోసం, కరెంటు కోసం, ధాన్యం కొనుగోళ్ల కోసం ఆందోళనలు చేస్తున్నారన్నారు.
రైతులు అష్టకష్టాలు పడుతున్నారు..
తెలంగాణలో కేసీఆర్ హయాంలో వేసిన పంట ఎండిపోయిన దాఖలాలు కనిపించలేవని, నేడు అంతటా పంటలు ఎండిపోతున్నాయని, కరువు కటకాలు వస్తున్నాయని మండిపడ్డారు. ఎండింది పోగా పండిన కాస్త పంటను కూడా కొనుగోలు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రేవంత్ సర్కార్ రైతులకు ఒరుగబెట్టిందేమి లేదని.. రుణమాఫీలో ఫెయిల్ అయ్యారని, రైతు భరోసా అందడం లేదని.. రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు.
ఈ సందర్బంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు ఆందోళన చేస్తుంటే ఎస్‌ఐ రవికాంత్ రావు జోక్యం చేసుకొని, మీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. పొద్దు తిరుగుడు ధాన్యాన్ని వెంటనే కొనుగోళ్లు చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ ఆందోళన లో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు చిలువేరి మల్లారెడ్డి, బక్క కనకయ్య, మంగ నర్సింలు, మంగ యాదగిరి, నంధారం నరేందర్ గౌడ్, జహంగీర్‌తోపాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.
