- షాపులోకి వెళ్లొచ్చేసరికి అపహరించిన దుండగులు
- రూ.4లక్షలు చోరీ చేశారంటున్న బాధితుడు
- స్టేషన్ లో ఫిర్యాదు.. పోలీసుల విచారణ
- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
వరంగల్ వాయిస్, మహబూబాబాద్: ఓ రైతు బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసుకొని నగదును తన ద్విచక్ర వాహనంలోని ట్యాoకు కవర్ లో పెట్టుకొని బయలుదేరి మార్గ మధ్యలో ఓ షోరూమ్ ఎదుట పార్కింగ్ చేసి లోపలికి వెళ్లి బయటకు వచ్చే సరికే దుండగులు 4 లక్షల రూపాయలు చోరీ చేసిన సంఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్స్ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి..
జిల్లాలోని మల్యాల గ్రామశివారు రామోజీ తండాకు చెందిన బానోతు శ్రీను అనే రైతు జిల్లా కేంద్రంలోని గుమ్ముడూరు ఎస్బీఐలోని తన ఖాతా నుంచి రూ.4లక్షలు డ్రా చేసుకుని తన ద్విచక్ర వాహనంలోని ట్యాంక్ కవర్ లో పెట్టుకొని బయలు దేరాడు. మార్గమధ్యలో ట్రాక్టర్ షోరూమ్ ఎదుట వాహనాన్ని పార్కింగ్ చేసి షోరూమ్ లోకి వెళ్లి బయటకు వచ్చి వాహనంలోని నగదు చూసేసరికి డబ్బులు లేకపోవడంతో చోరీ జరిగిందని తెలుసుకొని వెంటనే టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బైక్ పార్కింగ్ చేసి రహదారి అవతలి వైపు వెళ్లినప్పుడే దుండగులు వాహనం లోని 4 లక్షల నగదు తో పాటు డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు చోరీ చేశారని బాధితుడు కన్నీరుమున్నీరయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.