- మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
వరంగల్ వాయిస్, హైదరాబాద్ : మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ బీసీ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. వెనుకబడిన కులాలకు అన్ని రంగాలలో అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యల గురించి బీఆర్ఎస్ పార్టీ బీసీ ప్రజా ప్రతినిధులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలో వెనుకబడిన కులాల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం విచారకరమన్నారు. తమిళనాడు పర్యటన సందర్బంగా ఇటీవల పరిశీలించిన అంశాలను గురించి చర్చించారు. చట్టసభలలో బీసీలకు 33శాతం, స్థానిక సంస్థల ఎన్నికలలో 42శాతం రిజర్వేషన్స్ అమలయ్యే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు గాను మహాత్మా జ్యోతిభా పూలే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ, త్యాగధనులు కొండా లక్ష్మణ్ బాపూజీలను స్ఫూర్తిగా తీసుకుని, కేసీఆర్ మార్గనిర్దేశనంలో మరింత ఐకమత్యంతో పోరు సల్పుదామన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్, కుల గణన చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, బీసీలకు అన్యాయం జరుగుతున్నదని, కేవలం ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారన్నారు. అన్ని రంగాలలో మన న్యాయమైన హక్కుల్ని సాధించుకునేందుకు, వాటా దక్కించుకునేందుకు మనమందరం బీసీ కులాలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చి పోరు సల్పుదామని చెప్పారు.