- కేంద్రానికి సుప్రీం నోటీసులు..
- 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం
వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేదించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచరణకు చేపట్టి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీ ఇండియా ది క్వశ్చన్ ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం విచారణ జరిపింది. పిటిషన్లను విచారించిన సుప్రీం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 3 వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ లో విచారిస్తామని చెప్పింది.
2002 గుజరాత్ అల్లర్లపై రూపొందించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని నిషేధిస్తూ కేంద్రం కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్, కార్యకర్త లాయర్ ప్రశాంత్ భూషణ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం నోటీసులు జారీ చేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏప్రిల్‌లో చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా, గుజరాత్‌లోని గోద్రాలో 2002లో అల్లర్లు చోటుచేసు కున్నాయి. ఈ ఘటన అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీబీసీ తాజాగా ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. అయితే, ఆ డాక్యుమెంటరీలో అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోదీకి, గుజరాత్ హోంమంత్రిగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సంబంధించి కొన్ని అభ్యంతరకర విషయాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం డాక్యుమెంటరీని సెన్సార్ చేయకుండా అడ్డుకోవాలంటూ బీబీసీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దాంతో కోర్టు కేంద్రానికి తాజా ఆదేశాలు జారీచేసింది.
