- మహబూబాబాద్ కోర్టు సంచలన తీర్పు
- మూడేళ్ల క్రితం ఘటన
వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ లో మూడేళ్ల క్రితం తొమ్మిది సంవత్సరాల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడు మంద సాగర్ కు మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం జిల్లా కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కోర్టు తీర్పుపై దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే..మహబూబాబాద్ పట్టణంలోని కృష్ణ కాలనీలో నివాసముంటున్న జర్నలిస్ట్ కుసుమ రంజిత్ రెడ్డి-వసంత దంపతులు కుమారుడైన దీక్షిత్ రెడ్డి 18 అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ స్థానికంగా ఉంటూ ఆటో మొబైల్ షాప్ నడుపుకుంటున్నాడు. ఆర్థికంగా ఉన్న దీక్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు గుంజాలని కుట్ర పన్నిన మంద సాగర్ ఆయిల్ డబ్బాలు తీసుకరావాలి అని మాయ మాటలు చెప్పి బాలుడిని తన బండిపై ఎక్కించుకొని తాళ్ళ పూసపల్లి దగ్గర ఉన్న దానమయ్య గుట్టపైకి తీసుకెళ్ళి నిద్ర మాత్ర ఇచ్చి గొంతు పిసికి చంపి పెట్రోల్ పోసి తగుల బెట్టాడు. తర్వాత రంజిత్ రెడ్డికి ఫోన్ చేసి రూ.45లక్షలు డిమాండ్ చేశాడు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు బాలుని తల్లిదండ్రులు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి నిందితుడిని గుర్తించి జైలుకు తరలించారు. కేసు విచారణ పూర్తి కావడంతో తాజాగా మహబూబాబాద్ జిల్లా కోర్టు నిందితుడు మంద సాగర్ కు మరణ శిక్ష విదిస్తూ తిర్పు వెలువరించింది.