Warangalvoice

vannala_sriramulu

బాపూజీకి భారత రత్న ఇవ్వాలి

  • మాజీ ఎమ్మెల్యే వన్నాల

వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్దంతి వేడుకలు ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. హనుమకొండ హంటర్ రోడ్ లోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ భవన్ ప్రాంగణంలోని బాపూజీ నిలువెత్తు విగ్రహానికి ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చేర్మన్,వర్దన్నపేట మాజీ శాసన సభ్యుడు వన్నాల శ్రీరాములు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వన్నాల మాట్లాడుతూ దేశం గర్వించదగిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి భారత రత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాపూజీ స్పూర్తిదాయకంగా, నిస్వార్థ సేవలు అందించారని వన్నాల కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాట కాలంలో కీలక భూమిక పోషించారని వన్నాల స్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం బాపూజీ జయంతిని మాత్రమే అధికారికంగా నిర్వహిస్తున్నది, వర్థంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని వన్నాల కోరారు. ఐఐహెచ్ టీ కి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు నామకరణ చేయడం, గత ప్రభుత్వం ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు నామకరణ చేయడం ఆహ్వానించే పరిణామమని వన్నాల స్వాగతించారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం,సహకార రంగాల పటిష్టత కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని వన్నాల అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లోనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ సాధించే వరకు ఎలాంటి పదవులు తీసుకోనని శపథం చేసిన బాపూజీ చివరి వరకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి పోరాడిన గొప్ప వ్యక్తి అని వన్నాల ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి వేముల సదానందం నేత, హనుమకొండ జిల్లా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు ఆనందం, పద్మశాలి సేవా సంఘం నాయకులు పాశిగంటి రాజేందర్, గుండు సదానందం, శ్రమ శక్తి అవార్డు గ్రహీత కుసుమ శ్యాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిద్దామని ప్రతిజ్ఞ చేశారు.

vannala_sriramulu

vannala_Sreeramulu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *