- భూక్యా సరితను మోసం చేసిన రాముని శిక్షించాలి
- డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్
వరంగల్ వాయిస్, కమలాపూర్ : నిరుపేద ఎస్టీ లంబాడి సామాజిక వర్గానికి చెందిన వికలాంగ మహిళ భూక్య సరితను మొదటి వివాహం చేసుకొని తనతో కూతురిని కనీ ఆమెకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకొని మోసం చేసి తప్పించు తిరుగుతున్న పూలాంటి రాముపై చర్య తీసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట బాధిత మహిళా కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమలాపూర్ గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న కమలాపూర్ వాసి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన పులాంటి రాము హనుమకొండ బాలసముద్రంలో నివాసముంటున్న భూక్య సరితను మాయ మాటలు చెప్పి లోబర్చుకొని మొదటి వివాహం చేసుకొని ఆమెతో కూతురిని కూడా కన్నాడని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యుల ఒత్తిడితో పులాంటి రాము బాధితురాలికి తెలియకుండా రెండవ వివాహం చేసుకొని మోసం చేసి తప్పించుకుంటున్నాడని, దీనిపై గతంలో బాధితురాలు హనుమకొండలోని మహిళా పీఎస్ లో ఫిర్యాదు చేయగా బాధితురాలికి మూడు లక్షల అరవై వేల రూపాయలతో పాటు, 60 గజాల ఇంటి స్థలాన్ని, పోషణ ఖర్చుల నిమిత్తం నెలకు రూ.3000 ఇస్తామని పెద్దమనుషుల సమక్షంలో రాము కుటుంబ సభ్యులు ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. అయినప్పటికీ కూడా బాధిత మహిళ భూక్య సరితకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, ఈ విషయమై గత పది రోజుల క్రితం సంబంధిత కమలాపూర్ పీఎస్ లో బాధిత మహిళా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, పీడి యాక్ట్ నమోదు చేయాలని కోరారు. లేకుంటే బాధితురాలికి మద్దతుగా న్యాయం జరిగే వరకు గ్రామపంచాయతీ, పోలీస్ స్టేషన్, నిందితుడి ఇంటి ముందు ధర్నా చేస్తామని, డీబీఎఫ్ తో సహా ఇతర సామాజిక, దళిత, గిరిజన, ఆదివాసి, ప్రజా సంఘాల మద్దతు కూడా కట్టుకొని న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత మహిళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
