Warangalvoice

ప్రై‘వేటు’కు సిద్ధంగా వైటీపీఎస్‌!

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఓ ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్లాంట్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్స్‌ (ఓఅండ్‌ఎం)ను సదరు సంస్థకు అప్పగించేందుకు భారీ కుట్ర చేశారా? అంటే.. టీజీ జెన్‌కో ఇంజినీర్లు అవుననే అంటున్నారు.

  • ప్లాంట్‌ నిర్వహణ లోపం వెనక కుట్ర
  • ఉద్దేశపూర్వకంగానే ఓఅండ్‌ఎం స్టాఫ్‌ ఇంజినీర్లను కేటాయించని జెన్‌కో
  • ఆరు నెలలుగా వేధిస్తున్న సిబ్బంది కొరత
  • సీఈ లేఖ రాసినా స్పందన శూన్యం
  • ప్లాంట్‌ను ప్రైవేటుకు అప్పగించే ప్లాన్‌
  • జెన్‌కో ఇంజినీర్ల అనుమానం

వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను ఓ ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్లాంట్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్స్‌ (ఓఅండ్‌ఎం)ను సదరు సంస్థకు అప్పగించేందుకు భారీ కుట్ర చేశారా? అంటే.. టీజీ జెన్‌కో ఇంజినీర్లు అవుననే అంటున్నారు. కుట్రలో భాగంగానే ఈ ప్లాంట్‌కు ఇంజినీర్లు, సిబ్బందిని కేటాయించలేదని చెప్తున్నారు. నిర్వహణ లోపాలు తలెత్తినా ప్లాంట్‌ను పట్టించుకోలేదని అంటున్నారు. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని, పెద్ద ప్రణాళిక ఉందని అనుమానిస్తున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రిపూట యూనిట్‌-1లో ఆయిల్‌ లీకై ఉష్ణోగ్రతలు పెరిగి అగ్ని ప్రమాదం సంభవించింది.

రాత్రి పూట కావడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ ఆస్తినష్టం మాత్రం భారీగానే జరిగింది. మొత్తంగా 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ప్లాంట్‌ నిర్వహణకు అవసరమైన సిబ్బంది, ఇంజినీర్లు లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు జెన్‌కో ఇంజినీర్లు తేల్చారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెన్స్‌ సిబ్బంది కొరతతోనే ప్రమాదం జరిగిందని గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులు నివేదిక కోరారు. సిబ్బందిని కేటాయించాలని తాము మొత్తుకున్నా పట్టించుకోలేదని, దీంతోనే ప్లాంట్‌లో అగ్నిప్రమాదం జరిగినట్టు ప్లాంట్‌ అధికారులు నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. యూనిట్‌ పునరుద్ధరణకు నెలరోజులు పట్టే అవకాశముంది. అప్పటి వరకు విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లే లెక్క.

తెరవెనుక.. పెద్ద ప్లానే..

పవర్‌ ప్లాంట్‌లోని రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి జరుగుతున్నది. ఒక యూనిట్‌ మూడు షిప్టుల్లో నడవాలంటే దాదాపు 200 మంది ఇంజినీర్లు, మరో 300 మంది ఓఅం డ్‌ఎం సిబ్బంది అవసరం. దాదాపు అన్ని ప్లాంట్లలోనూ సరిపోయే ఇంజినీర్లు, ఓఅండ్‌ఎం సిబ్బంది ఉన్నారు. జెన్‌కో ద్వారా నడుస్తున్న అన్ని ప్లాంట్లకు ఇంజినీర్లు, సిబ్బందిని కేటాయించి, ఒక్క వైటీపీఎస్‌కు మాత్రం పూర్తిస్థాయి సిబ్బందిని ఎందుకు కేటాయించలేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. వారం రోజుల క్రితం 150కి పైగా సిబ్బందిని కేటాయించారు. వీరు మూసివేసిన ప్లాంట్లకు చెందిన వారే. కానీ వైటీపీఎస్‌ ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ఇంజినీర్లు, సిబ్బందిని కేటాయించలేదు. ఇంజినీర్లు, సిబ్బందిని కేటాయించకపోవడం వెనుక బిగ్‌ స్కెచ్‌ ఉన్నట్టు ఇంజినీర్లు అనుమానిస్తున్నారు.

వైటీపీఎస్‌కు అవసరమైన సిబ్బందిని కేటాయించకుంటే సమస్యలు తలెత్తి విద్యుదుత్పత్తికి ఆటంకం కలిగి ప్రమాదం సంభవిస్తుందని, అప్పుడు అనుకూలంగా విచారణ చేయించి జెన్‌కో విఫలమైందని నిరూపించవచ్చన్నది ప్రభుత్వ యోచన. అప్పుడు జెన్‌కోను తప్పించి ప్రైవేటు సంస్థకు వైటీపీఎస్‌ను అప్పగించవచ్చని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అలాగే, ఈ ప్లాంట్‌ను నిర్మించిన బీఆర్‌ఎస్‌ సర్కారు, కేసీఆర్‌పై నిందలేసి దోషిగా చూపించాలనేది సర్కారు పెద్దల ప్లాన్‌గా తెలిసింది. ఆ కారణంగానే ఆరు నెలలుగా యాదాద్రి ప్లాంట్‌కు సిబ్బందిని, ఇంజినీర్లను కేటాయించలేదని సాక్షాత్తు జెన్‌కో ఇంజినీర్లే అంటున్నారు.

ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టేందుకేనా?

యాదాద్రి పవర్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ను (ఓఅండ్‌ఎం)ను ఓ ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. సర్కారు పెద్దల స్థాయిలో దాదాపు నిర్ణయం కూడా జరిగిపోయింది. ఈ తంతంగం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయట. కమిషన్లు కూడా ఖరారయ్యాయట. జెన్‌కో ద్వారా అయితే ఓఅండ్‌ఎం వ్యయం అధికమని, ప్రైవేట్‌ కంపెనీ అయితే తక్కువవుతుందని కారణాలు చూపారట. అయితే దీనిని జెన్‌కో ఇంజినీర్లు వ్యతిరేకించారు. ప్రైవేట్‌కు అప్పగిస్తే ఊరుకోబోమని, జెన్‌కో ద్వారానే చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్‌ చేశాయి. దీంతో సదరు కంపెనీకి అప్పగించే ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచే అసలు కథ మొదలైంది. తెర ముందు ప్రయత్నాలు మాని, తెరవెనుక అసలు కథ మొదలుపెట్టారు. యాదాద్రి ఓఅండ్‌ఎం నుంచి జెన్‌కోను తప్పించి, ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు మొదలెట్టారు.

పోస్టింగ్స్‌ ఇవ్వకుండా తాత్సారం

టీజీ జెన్‌కోలో కొంతకాలం క్రితం 203 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లకు అసిస్టెంట్‌ డివిజినల్‌ ఇంజినీర్లుగా (ఏడీఈ) పదోన్నతులు కల్పించారు. వీరికి ఎక్కడా పోస్టింగ్స్‌ ఇవ్వలేదు. ప్రైవేట్‌ కంపెనీకి ఓఅండ్‌ఎం పనులు కట్టబెట్టడంలో భాగంగానే పదోన్నతులు పొందిన వారికి పోస్టింగ్స్‌ ఇవ్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు ఆరు నెలలుగా పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించలేదు. ప్లాంట్‌లో ఇంజినీర్లు, సిబ్బంది కొరత ఉన్నదని, ప్లాంట్‌ను ఎలా నడపాలని వైటీపీఎస్‌ చీఫ్‌ ఇంజినీర్‌ జెన్‌కో సీఎండీకి లేఖ రాశారు. తగినంత సిబ్బంది, ఇంజినీర్లను కేటాయించాలని ఆ లేఖలో కోరారు. అయినా స్పందించిన దాఖలాల్లేవు. సిబ్బందిని కేటాయించలేదు. పదిహేను రోజుల క్రితం కొంతమంది సిబ్బందిని, అదీ.. ఒక్క యూనిట్‌కే కేటాయించి చేతులు దులుపుకొన్నారు.

A Fire Broke Out At Yadadri Power Plant In Damarcharla Nalgonda
A Fire Broke Out At Yadadri Power Plant In Damarcharla Nalgonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *