- సామాజిక సేవే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథి
- అమ్మనాన్నల స్ఫూర్తితో పుట్టిన ఆలోచన..
- పుట్టిన ఊరికి ఏదైనా చేయాలన్న తపన
- పేద విద్యార్థులకు భరోసాగా ట్రస్ట్ ఏర్పాటు
- విద్యా స్ఫూర్తిగా సాగుతున్న బృహత్తర కార్యక్రమం
‘‘పేదరికం ఎంతో కఠినమైనదో తెలుసు.. దాని ఫలితాలు మనిషి జీవితంపై ఎంత ప్రభావం చూపుతాయో తెలుసు.. పేదరికంపై విజయం సాధించాలంటే సగటు జీవికి చదువు ఒక్కటే ఏకైక ఆయుధం.. చిన్నతనంలో అమ్మనాన్న పడిన కష్టమే తనను ఉన్నత శిఖరాలు అధిరోహింపజేసేలా చేసింది..’’ ఈ మాటలు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చిట్ల పార్థసారథి హృదయాంతరాల్లోనుంచి వచ్చినవి. అమ్మనాన్నల స్ఫూర్తితో పుట్టిన ఊరి రుణం తీర్చుకోవడానికి చిట్ల ప్రమీల – జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ను ఆయన 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ యేడాది పేద ప్రతిభావంతులకు ప్రోత్సాహంగా నగదు పురస్కారాలతోపాటు, బంగారు, వెండి పతకాలను అందిస్తూ చేయూత అందిస్తున్నారు. ప్రతిభావంతులకు పేదరికం అడ్డుకాకుడదనే లక్ష్యంతో విద్యార్థులకు భరోసా కల్పిస్తున్నారు.
వరంగల్ వాయిస్, ఆర్మూర్: పేదరికంలో మగ్గుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన చిట్ల ప్రమీల – జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ చేయూతనిస్తోంది. విద్యాస్ఫూర్తి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ప్రతియేటా నగదు పురస్కారాలతోపాటు, బంగారు, వెండి పతకాలను అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు హైదరాబాద్ మినీ రవీంద్రభారతిలో బోధనా విధానాలు, పద్ధతులపై శిక్షణ ఇప్పించి స్ఫూర్తిని చాటుకున్నది. ‘‘నేను, నా..’’ అనుకునే ఈ రోజుల్లో సేవచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చిట్ల ప్రమీల – జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చిట్ల పార్థసారథి. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదువలేకపోతున్న పిల్లలకు, ఆంగ్లం, గణితం, సైన్స్ నిపుణులతో పాఠాలు బోధించారు. పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరిచిపోలేని ఊరు మా ‘ఆర్మూర్’ అంటూ ఉచిత సేవలందిస్తున్నారు.
అది.. 2008 సంవత్సరం. సీనియర్ ఐఏఎస్ అధికారిగా చిట్ల పార్థసారథి పనిచేస్తున్నారు. పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో వారి తల్లిదండ్రులు స్వర్గీయ చిట్ల ప్రమీల – జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆర్మూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఆయన, ఆ స్కూల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు, బంగారు, వెండి పతకాలు, నగదు పారితోషికాలు అందించడం ప్రారంభించారు. ఆరోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా కొనసాగుతూ వస్తోంది. ప్రతీ యేటా ఆర్మూర్ లోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న ఎనిమిది మంది విద్యార్థులకు ఈ పురస్కారాలను అందిస్తున్నారు. ప్రముఖ హ్యాండ్ రైటింగ్ నిపుణుడు మల్లికార్జున్, ప్రముఖ హిప్నాటిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ పట్టాభిరామ్ ను ఆర్మూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆహ్వానించి విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, పాఠాలు బోధించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, జిల్లా విద్యాధికారులతోపాటు, ప్రముఖుల సమక్షంలో ప్రతి యేటా కార్యక్రమాలను పార్థసారథి ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చిన్నతనంలో తల్లిదండ్రులు పడిన కష్టాలను స్వయంగా చూసిన ఆయన వారిని స్ఫూర్తిగా తీసుకుని పేదలకు తనవంతు సహాయం చేస్తున్నారు. గత పద్నాలుగేళ్లుగా సమాజ సేవ చేస్తున్నారు. సమాజంలో ఎంతో మంది పిల్లలు ఆర్థికంగా లేక.. అవకాశాలు రాక, చదువును మధ్యలోనే ఆపేసేవారికి చేయూతనందిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు తానున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు.







