- పట్టణ ప్రగతిలో గోప్యమెందుకో?
- ఫొటో ఫోజులకే నాయకులు పరిమితం
మేయర్, కమిషనర్‌లకు ప్రత్యేక షెడ్యూలే లేదు
మొక్కు బడిగా ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం
మహానగరంలో సమస్యలు బోలెడు
మహా నగరంలో ఈనెల 3నుంచి ప్రారంభమైన పట్టణ ప్రగతి మొక్కుబడిగా సాగుతోంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోజువారీగా నిర్వహించే పనులకే పట్టణ ప్రగతి బిల్డప్ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. పట్టణ ప్రగతిలో ప్రముఖంగా పాల్గొనాల్సిన మేయర్, కమిషనర్‌లకు ప్రత్యేక షెడ్యూలు లేకపోవడం, వారు ఏరోజు ఏ డివిజన్‌లో పర్యటిస్తారో గోప్యంగా ఉంచడం, అసలు పట్టణ ప్రగతికి ప్రత్యేకంగా మంజూరైన నిధుల వివరాలను కూడా వెల్లడిరచకపోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతిలో మేయర్, కమిషనర్ ఏ సమయంలో ఏ డివిజన్‌లో పర్యటిస్తారో తెలియక ప్రజలు తికమక పడుతున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చేందుకే పట్టణ ప్రగతి అన్న చందంగా సాగుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
– వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వం ప్రకటించిన 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈ నెల 3న అట్టహాసంగా ప్రారంభించారు. ఈనెల 18వరకు దీనిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం చొప్పున 15 రోజులకు ప్రణాళిక రూపొందించారు. బల్దియా ఆధ్వర్యంలో రోజు వారీగా నిర్వహించే పనులనే పట్టణ ప్రగతి ప్రణాళికలో పొందుపర్చడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. మొదటి రోజు కార్పొరేటర్ అధ్యక్షతన డివిజన్‌లోని 15 మంది సభ్యులతో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని, ఈ కమిటీలో యువకులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, ప్రముఖులకు స్థానం కల్పించాలని, అందరితో వార్డు సభ నిర్వహించాలంటూ ప్రణాళిక రూపొందించారు. కాని నగరంలోని చాలా డివిజన్లలో కమిటీలను వేసింది లేదు..సమావేశాలు నిర్వహించిందీ లేదు. చాలా డివిజన్లలో ప్రజల సమస్యలను పక్కన బెట్టి అనవసరపు పనులకు ప్రాధాన్యం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుగుబాటు తప్పదనే..
చాలా డివిజన్లలో సమస్యలను పరిష్కరించడంలో బల్దియా విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని సగానికిపైగా డివిజన్లలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. భగీరథ గుంతలు మృత్యు కుహరాలుగా మారాయి. డ్రైనేజీలు కంపు కొడుతున్నాయి. నగరంలోని చాలా పనులకు టెండర్లు పూర్తి అయినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ముంపు నుంచి నగర ప్రజలకు ఉపశమనం కల్పిస్తామన్న మంత్రి హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఇలాంటి ఎన్నో సమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వీటిపై ఇప్పటికే పలుమార్లు లోకల్ కార్పొరేటర్లకు చెప్పి విసుగెత్తారు. పట్టణ ప్రగతిలో భాగంగా తమ డివిజన్‌కు వచ్చే మేయర్, కమిషనర్‌కు స్థానిక సమస్యలను ఏకరువు పెట్టేందుకు డివిజన్ల వారీగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయితే మేయర్, కమిషనర్ ముందుగా తమ పర్యటనను ప్రకటిస్తే డివిజన్లలో ప్రతిఘటన తప్పదని భావించినందునే వారి పర్యటనను గోప్యంగా ఉంచుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
పడకేసిన పారిశుధ్యం..
నగరంలో పారిశుధ్యం పడకేసింది. డివిజన్లలో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. దీనిని తొలగించేవారే లేక పోవడంతో జనం ఎవరికీ చెప్పుకోవాలో తెలియక నానా తంటాలు పడుతున్నారు. కనీసం పట్టణ ప్రగతిలోనైనా పారిశుధ్యం పనులు చేసే వారు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి ఏడూ వేసవి కాలం చివరిలో ప్రధాన కాలువల్లో చేపట్టాల్సిన పూడిక తీత మొక్కుబడిగా సాగుతోంది. నగరంలోని 35వ డివిజన్ శివనగర్ పెద్ద నాలాలో 12 రోజుల క్రితం పైపైనే పూడిక తీసి రోడ్డుపై పోశారు. నిత్యం ఈ రోడ్డువెంట వందల మంది ప్రయాణించడంతోపాటు చుట్టు పక్కల గృహాలు ఉన్నాయి. దీనిపై స్థానికులు శానిటేషన్ జవాన్‌కు, ఆరోగ్య శాఖ అధికారికి, స్థానిక కార్పొరేటర్‌కు పలుమార్లు విన్నవించుకున్నా స్పందించేవారే కరువయ్యారు. పట్టణ ప్రగతిలో అధికారులంతా బిజీ అంటూ దాటవేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. పట్ణణ ప్రగతి షెడ్యూల్‌లోనే 15 రోజుల పాటు పారిశుధ్య పనులను చేపట్టాలని ఉన్న విషయాన్ని బల్దియా పాలకులు, అధికారులు పూర్తిగా విస్మరించడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగించడం, వార్డులలోని ఖాళీ స్థలాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం, రోడ్డు వెంట ఉన్న చెత్తా, చెదారాన్ని తొలగించడం, ఇంకుడు గుంతల ప్రాముఖ్యంపై ప్రచారాన్ని గాలికి వదిలేశారు.
ప్రజలను కలిసేది లేదు..
పట్టణ ప్రగతిలో భాగంగా డివిజన్‌లలో పర్యటిస్తున్న నాయకులు, అధికారులు ప్రజలతో కలిసేది లేదు.. వారి సమస్యలను వినేది లేదు అన్న చందంగా సాగుతోంది. పార్టీ కార్యకర్తలు, అధికారులు మినహా సమస్యలు తెలిపేందుకు స్థానికులు ఎవ్వరూ వారిని కలువడం లేదు. డివిజన్‌లో ఎక్కడైన ఓ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా వారు చేయడం లేదు.
పాపం ఆర్పీలు..
ఇటునుంచి అటు..అటునుంచి ఇటు..ఇది ఆర్పీలు, అంగన్‌వాడీల పరిస్థితి. ఫలానా డివిజన్‌లో మేయర్, కమిషనర్ పర్యటిస్తున్నారని తెలియగానే ఆర్పీలను, అంగన్‌వాడీలను జీడబ్ల్యుఎంసీ వాహనంలో అటు తరలిస్తున్నారు. అక్కడ ఫొటో షెషన్ ముగియగానే మేయర్, కమిషనర్ తిరిగి ఏ డివిజన్‌కు వెళ్తున్నారో ఆ డివిజన్‌కు ఆర్పీలు, అంగన్‌వాడీలను తరలిస్తున్నారు. పట్టణ ప్రగతి పేరిట ఆర్పీలు, అంగన్‌వాడీలను ఇలా ఫొటో సెషన్‌కు వాడుకుంటున్నారు.
షెడ్యూల్ ప్రకటించాలి..
పట్టణ ప్రగతిలో భాగంగా నగరంలో పర్యటించే కమిషనర్, మేయర్‌ల షెడ్యూల్‌ను ముందస్తుగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. వారు ఏ రోజు ఏ డివిజన్‌లో పర్యటిస్తారు అన్న సమాచారాన్ని పత్రికల ద్వారా విడుదల చేయాలంటున్నారు. అలా ప్రకటిస్తేనే డివిజన్లలో పేరుకుపోయిన సమస్యలను వారికి విన్నవించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మూడో విడత పట్టణ ప్రగతిలో మేయర్, కమిషనర్ల పర్యటనలకు సంబందించిన సమాచారాన్ని ముందస్తుగానే తెలియజేసి స్థానిక సమస్యల పరిష్కారానికి వారు కృషి చేశారని, ప్రస్తుత కమిషనర్, మేయర్ మాత్రం ప్రజలకు దూరంగా సమస్యలను గాలికి వదిలి మసలుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వారి పర్యటన వివరాలను ముందస్తుగా తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు.
