- మహానగరంలో పట్టణ ప్రగతి అపహాస్యం
- పలు డివిజన్ల వైపు కన్నెత్తి చూడని మేయర్, కమిషనర్
- సమీక్షా సమావేశంలో నిలదీసిన అధికార పార్టీ కార్పొరేటర్లు
- ప్రజల నుంచి వచ్చిన వినతులు 5,960
- డ్రైన్లు, అంతర్గత రహదారులకు చెందినవే సగం
నగరాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం నగరంలో అపహాస్యం పాలైంది. పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక కార్పొరేటర్‌తో కలిసి మేయర్, కమిషనర్లు నగరంలోని అన్ని డివిజన్లలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాల్సి ఉన్నప్పటికీ వారు పలు డివిజన్ల వైపు కన్నెత్తికూడా చూడలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణ ప్రగతిపై బల్దియా ప్రధాన కార్యాలయంలో చివరి రోజు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లే మేయర్, కమిషనర్లను నిలదీశారు. ‘‘మా డివిజన్‌కు రండి..సమస్యలను మీకు చూపిస్తాం’’ అంటూ టీఆర్ ఎస్ కార్పొరేటర్లు గట్టిగానే తమ వాణిని వినిపించారు. ఫ్యాన్ల కింద కూర్చుంటే ప్రజల సమస్యలు ఎట్లా తెలుస్తాయంటూ ప్రశ్నించారు. మీకు నచ్చిన డివిజన్లలోనే పర్యటిస్తే మిగతా డివిజన్ల పరిస్థితి ఏంటంటూ నిలదీశారు. 15రోజుల పాటు నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదంటూ మండిపడ్డారు. ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు గ్రేటర్ పరిధిలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ప్రజలనుంచి సమస్యలు వెల్లువెత్తాయి.
– వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేమితనంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం నగరంలో అపహాస్యం పాలైంది. నగరంలోని ప్రతీ డివిజన్‌లో లెక్కకు మించి సమస్యలు ఉన్నా వాటిని తెలుసుకుని పరిష్కరించాలన్న ఆలోచనే పాలకులకు కరువైందని ప్రతిపక్ష కార్పొరేటర్లతోపాటు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. నగరంలో 15 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించినా స్థానిక కార్పొరేటర్లే ఆయా డివిజన్లలో పర్యటించి ప్రజలనుంచి స్థానిక సమస్యలపై వినతులు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిరదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో డివిజన్లలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు. పట్టణ ప్రగతిలోనైనా డివిజన్ సమస్యలు తీరుతాయని ఆశపడిన వారికి ఎదురు చూపులే మిగిలాయంటున్నారు. కేవలం ప్రచారం కోసమే పట్టణ ప్రగతి నిర్వహించారు తప్పితే ప్రజల సమస్యలపై వారికి పట్టింపులేదంటూ మండిపడుతున్నారు.
డివిజన్ల వైపు కన్నెత్తి చూడని మేయర్, కమిషనర్..
పట్టణ ప్రగతిలో భాగంగా నగరంలోని ప్రతి డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్‌తో కలిసి మేయర్, కమిషనర్ పర్యటించి సమస్యలు తెలుసుకోవాల్సి ఉన్నప్ట్‌కీి అది అమలుకు నోచుకోలేదు. మేయర్, కమిషనర్‌కు నచ్చిన డివిజన్లలోనే పర్యటనలు నిర్‌లహించి పట్టణ ప్రగతిని మమ.. అనిపించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి పక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ఉన్న డివిజన్‌లతోపాటు అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్ల డివిజన్ల వైపు వారు కన్నెత్తి కూడా చూడలేదని బహిరం గంగా ఆరోపిస్తున్నారు. మేయర్, కమిషనర్ డివిజన్‌లో పర్యటించకపోవడంతో అధికారులు కూడా ఆయా డివిజన్లపై చిన్నచూపు చూస్తున్నారని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యల తిష్ఠ ..
పేరుకు పెద్ద..సమస్యల తిష్ఠ అన్న చందంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించారన్న ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని అన్ని డివిజన్లలో తాగు నీరులేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, లెక్కకు మించి మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీలు ఉన్నా వాటి గురించి ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలకు ముందు ప్రతి రోజు మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తామంటూ ప్రకటనలు చేసినా అది నగరంలో ఎక్కడా అమలుకు నోచుకోలేదు. కనీసం రోజు విడిచి రోజు కూడా నీటిని సరఫరా చేయడం లేదు. చాలా డివిజన్లలో నాలుగైదు రోజులైనా తాగునీటి సరఫరా జరుగడంలేదు. దీనిపై ప్రజలు ప్రశ్నిస్తారని తెలిసే చాలా డివిజన్లలో మేయర్, కమిషనర్లు పర్యటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. నగరంలో 1,500పైగా లీకేజీలు ఉన్నట్లు అధికారులే ప్రకటిస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. అయినా దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
వెల్లువెత్తిన వినతులు..
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నగరంలోని 66 డివిజన్లలో వివిధ సమస్యలపై 5,960 వినతులు అందాయి. వీటిలో అత్యధికంగా సీసీ డ్రైన్లు, అంతర్గత రహదారులకు చెందినవే ఉన్నాయి. నగరం రోజు రోజుకూ విస్తరిస్తున్నా ప్రజలకు తగినట్లుగా వసతులు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారనేందుకు ఈ వినతులే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సీసీ డ్రైన్ల ఏర్పాటు చేయాలంటూ అత్యధికంగా 1,054, అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలంటూ 975వినతులు వచ్చాయి. వీటితోపాటు వేలాడే విద్యుత్ తీగలను సరిచేయాలంటూ 85, వీధి దీపాల ఏర్పాటు చేయాలంటూ 271, స్తంభాలను మార్చేందుకు 352, శ్మశాన వాటికల ఏర్పాటుకు 35, కల్వర్టుల నిర్మాణానికి 189, కొత్త పైప్ లైన్ల వేసేందుకు 69, నాలాల మరమ్మతులకు 59, పార్కుల అభివృద్ధికి 10, లీకేజీలు అరికట్టేందుకు 192 , బోర్ ల మరమ్మతులకు 18, ఇతర సమస్యలపై 147 విజ్ఞాపనలు అందాయి.
సమీక్షలోనూ నిలదీత..
నగరంలో 15 రోజుల పాటు నిర్వహించిన పట్టణ ప్రగతిపై చివరి రోజైన శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ప్రతిపక్ష కార్పొరేటర్లతోపాటు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మేయర్, కమిషనర్‌ను నిలదీశారు. ‘‘మా డివిజన్‌కు రండి.. సమస్యలను చూపిస్తాం’’ అంటూ వారిని ఘాటుగానే ప్రశ్నించారు. నగరంలోని కొన్ని డివిజన్లలో మేయర్, కమిషనర్ పర్యటించకపోవడానికి కారణమేమిటంటూ నిలదీశారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారే ఇలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలకు తమపై నమ్మకం పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పలు డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లే ప్రజల దగ్గరకు పోయి సమస్యలపై వినతులు తీసుకోవాల్సి వచ్చిందంటూ వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా డివిజన్లలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి పాలకులు మార్గం చూపాలని కోరుతున్నారు.



