- ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై సీరియస్
- ఆరుగురు యజమానులపై కేసులు
- చేయి చేసుకోవడంతో ముదిరిన వివాదం
- ఒక రోజు బంద్ పాటించి నిరసన
‘‘ప్రభుత్వానికి క్రమం తప్పకుండా లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాం.. అలాగే అధికారులకు, పోలీసులకు నెలవారి మామూళ్లు అందిస్తున్నాం.. అడిగినప్పుడల్లా లిక్క ర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నాం.. ’’ ఇన్నీ చేస్తున్నా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారంటూ పోలీసులు కేసు నమోదు చేయడంపై బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే బార్లు నష్టాల్లో కూరుకుపోయి మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని యజమానులు అంటుండగా ఎవరైనా ఎక్సైజ్ నిబంధనలు పాటించాల్సిందే నంటూ పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఇరువురి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో బార్ యజమానులు మంగళవారం ఒక్క రోజు బంద్ కూడా పాటించారు. పోలీసులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై సీరియస్‌గా వ్యవహరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బార్ ఓనర్లకు, పోలీసుల మధ్య వార్ మొదలైంది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ యజమానులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెల్లారింది మొదలు రండి బాబు రండి అంటూ ఆహ్వానం పలుకుతున్న బార్ యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల తెల్లవారు జామునే త్రినగరిలోని పలు బార్లపై ఆకస్మిక దాడులు నిర్వహించి ఆరింటిపై కేసులు నమోదు చేశారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్తగిరి బార్, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల బార్, కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసి బార్, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రకీలాద్రి బార్, మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ బార్, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస బార్‌పై దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారు జామునే బార్లు తెరువడంపై కేసులు కూడా నమోదు చేశారు. ఇదే సమయంలో సదరు బార్ మేనేజర్‌తోపాటు కొంత మద్యం, నగదును స్వాధీనం చేసుకొని ఏరియా పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఇదే బార్ ఓనర్లకు, , పోలీసుల మధ్య వార్‌కు కారణమైంది.
చేయి చేసుకోవడంతో ముదిరిన వివాదం..
ఎక్సైజ్ నిబంధనలు అతిక్రమించారనే నెపంతో ఆరుగురు బార్ల మేనేజర్లపై కేసులు నమోదు చేసిన తర్వాత కౌన్సిలింగ్‌కు పిలిచి ఎక్సైజ్ అధికారుల ముందే పోలీసులు చెయ్యి చేసుకోవడాన్ని బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు సీరియస్‌గా తీసుకున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి లిక్కర్ వ్యాపారం చేస్తున్న వారిని దొంగళ్లా చూడటం, అవమాన పరిచే విధంగా వ్యవహరించడంపై వారు మండిపడుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారులపై ప్రతాపం చూపడంలోని పరమార్థమేమిటని ప్రశిస్తున్నారు. వ్యాపారుల గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించే తీరు మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల వ్యవహార శైలిని ఎండగడుతూ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌తోపాటు వరంగల్, హనుమకొండ కలెక్టర్లకు కూడా వినతిపత్రాలు అందజేశారు. విషయాన్ని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి అమీ తుమీ తేల్చుకొనేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే మామూళ్లు ఇస్తున్నాం..మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందనే విధంగా పోలీస్ కమిషనర్, ఎక్సైజ్ అధికారుల ముందే బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు పోలీసుల చర్యలను తప్పుబట్టే విధంగా వ్యవహరిస్తూ ఓవరాక్షన్ చేయడమే చేయి చేసుకునేందుకు కారణమైందని పోలీసులు చెప్పుకొస్తున్నారు.
బిజినెస్ చేయలేం..
ఎక్సైజ్ అధికారులు బిజినెస్ పెంచమంటూ వివిధ టార్గెట్‌లు పెడుతున్నారు. పోలీసులేమో ఆంక్షలు విధిస్తున్నారు. ఇట్లా అయితే బిజినెస్ చేసేదెలా అంటూ బార్ ఓనర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల్లోనైనా మార్పులు చేయాలి లేకుంటే ఏటీఎం (ఎనీ టైమ్ మందు)లనైనా మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి క్రమం తప్‌ఎకుండా లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నా ఏటీఎంలకు ఉన్న వెసులుబాటు బార్లకు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు అధికారులకు నెలవారి మామూళ్లు అందిస్తున్నాం, అడిగినప్పుడల్లా లిక్క ర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నాం అయినప్పటికీ తమపై పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంద్ సక్సెస్..
పోలీసుల వ్యవహార శైలిని నిరసిస్తూ నగరంలోని బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసి వేసి నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని బార్ల యజమానులు సమయపాలన పాటించాలని ఒత్తిడి తెస్తున్న పోలీసులు, చట్ట విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా 24 గంటలు మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులను ఎందుకు నియంత్రించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తేనే బార్లలో వ్యాపారం సాఫీగా సాగుతుందంటున్నారు. వారిని నియంత్రించకుండా బార్లు ఎక్సైజ్ నిబంధనల మేరకు పనిచేయాలంటే త్వరలోనే వ్యాపారాలు సాగక మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.

