- కాంగ్రెస్, బిజెపిలకు విమర్శలే లక్ష్యం
- మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
వరంగల్ వాయిస్,హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తున్నదని, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. బంగారు తెలంగాణకు భాగ్యనగరాన్ని మణిహారంలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నది. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల, అభివృద్ధి వికేంద్రీకరణ వంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ విపక్షాలకు ఎందుకు కానరావడం లేదన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నా, కాంగ్రెస్, బిజెపిలు విమర్శలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా డబుల్ ఇళ్లు పురోగతిలో ఉన్నాయని, అనేక చోట్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని, చాలామంది గృహ ప్రవేశాలు చేశారని అన్నారు. ఇందుకు కనిపిస్తున్న ఇళ్లే నిదర్శనమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా కేటాయింపులు, వ్యయాలు పెంచిందన్నారు. గ్రామాల అభివృద్దికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం దీనికి నిదర్శనమన్నారు. జనాభాలో సగంగా ఉన్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ప్రగతి బాటలో రహదారుల పాత్ర ఎంతో కీలకమైంది. తెలంగాణ రాష్ట్రంలోని హైవేలు, ప్రధాన రహదారులే కాకుండా గ్రావిూణ ప్రాంతాలలోనూ మెరుగైన రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్నది. తెలంగాణను అన్ని అంశాల్లోనూ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై ఉన్నారు. తలపెట్టిన అభివృద్ధి యజ్ఞాన్ని పట్టుదలతో కొనసాగిద్దాం. సమాజంలో అట్టడుగున్న ఉన్న ఆఖరి వ్యక్తి దాకా ప్రగతి ఫలాలను అందించాలన్న ఆకాంక్ష కెసిఆర్‌లో ఉందన్నారు. అందుకే విమర్శలు చేస్తున్న వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెబుతున్నారని అన్నారు. కేవలం విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే విసిగిపోయిన ప్రజలు రానున్న ఎన్నికల్లో బిజెపి,కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ది చెబుతారని తలసాని అన్నారు. బిజెపికి ప్రజలు తగిన రీతిలో సమాధానం ఇస్తున్నారని చెప్పారు.
