- ప్రశ్నించే గొంతుకలపై కుట్ర కేసులు సరికాదు
- కాకతీయ యూనివర్సిటీ కార్యదర్శి మర్రి మహేష్
వరంగల్ వాయిస్, కేయూ : గత మూడు నెలల క్రితం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ నేతలపై పెట్టిన పూసపల్లి కుట్ర కేసులో భాగంగా నిన్న పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి పేరు చేర్చడం పట్ల పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బుధవారంనిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం కాకతీయ యూనివర్సిటీ కార్యదర్శి మర్రి మహేష్ మాట్లాడుతూ పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి పేరును పూసపల్లి కుట్ర కేసులో చేర్చడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఇది ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడమేనని అన్నారు. గడిల పాలలను బద్దలు కొట్టి ప్రజల పాలనను తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వలే ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నదని వారన్నారు. నిరంతరం విద్యారంగ సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారనే కారణంగా ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ఉద్దేశంతో ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి పై అక్రమంగా పూసపెళ్లి కుట్ర కేసు నమోదు చేయడం చాలా దుర్మార్గమని, మొగిలి వెంకట్ రెడ్డి పై పెట్టిన పూసపల్లి కుట్ర కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులుగా, విద్యార్థి సంఘ నాయకులుగా సమాజంలో ఉన్న సబ్బండ వర్గాలను ఏకం చేసి రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే గొంతుకలపై ఉక్కు పాదం మోపాలనే ఉద్దేశంతో ఉన్న పాలకవర్గాలు వారి బుద్ధిని మార్చుకోవాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ యూనివర్సిటీ ఉపాధ్యాయులు రాజు, నాయకులు నరసింహ, రత్నాకర్, వెంకట్, అజిత్, నరసింహ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
