Warangalvoice

Rahul participated in Parliament meetings

పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొన్న రాహుల్‌

  • సూరత్‌ కోర్టు తీర్పు తరవాత పార్లమెంట్‌కు హాజరు
    వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: సూరత్‌ కోర్టు తీర్పు అనంతరం రాహుల్‌ శుక్రవారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఉదయం పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్‌ హాజరయ్యారు. అనంతరం లోక్‌సభ ప్రారంభం కాగానే ఆ సమావేశం లోనూ పాల్గొన్నారు. కోర్టు తీర్పుతో రాహుల్‌పై అనర్హత వేటు పడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత , ఎంపీ రాహుల్‌ గాంధీ కి గుజరాత్‌ లోని సూరత్‌ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. ’దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..?’ ఆయన ప్రశ్నించారు. దీనిపై బీజేపీ కోర్టుకు వెళ్లింది. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో గురువారం విచారణ జరిపిన సూరత్‌ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు రెండేండ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. నేర నిరూపణ రుజువైతే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరైనా తమ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని గతంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. పార్లమెంట్‌ సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేండ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే తీర్పు వచ్చిన క్షణం నుంచి వారు ఆ పదవికి అనర్హులవుతారు. అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా ఆరేండ్లపాటు అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ రాజకీయ భవితవ్యంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

    Rahul participated in Parliament meetings
    Rahul participated in Parliament meetings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *