- త్వరలోనే మినీ ‘పల్లె పోరు’
- పంచాయతీ ఉప ఎన్నికలకు అంతా సిద్ధం
- పూర్తయిన పోలింగ్ కేంద్రాల ఎంపిక
- ఉమ్మడి జిల్లాలో 32 సర్పంచ్, 11 ఎంపీటీసీ,
- 237 వార్డు స్థానాలు ఖాళీ
ఉమ్మడి వరంగల్ జిల్లా పల్లెల్లో త్వరలో పంచాయతీ
ఉప ఎన్నికల నగరా మోగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 32 సర్సంచ్, 11 ఎంపీటీసీ, 237 వార్డు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఎంపికైన కొందరు మృతి చెందడం, రాజీనామాలు చేయడం, సస్పెండ్ కావడం, ఇతర పదవులకు ఎన్నిక కావడం, కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడం వంటి కారణాల వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వారీగా ఎంపిక ప్రక్రియను కూడా పూర్తి చేశారు.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోసం గతంలోనే జాబితాలను తయారు చేసినప్పటికీ కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించ లేదు. 2019 జనవరిలో పంచాయతీ, అదే ఏడాది మేలో మండల, జిల్లా ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత ఎంపికైన కొందరు మృతి చెందడం, రాజీనామాలు చేయడం, సస్పెండ్ కావడం లేదా ఇతర పదవులకు ఎన్నిక కావడం, కొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడంతోపాటు కోర్టు వివాదాలతో ఎన్నికలు నిర్వహించని ప్రాంతాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 32 సర్సంచ్, 11 ఎంపీటీసీ, 237 వార్డు స్థానాలు ఖాలీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. కాగా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామానికి పూర్తి స్థాయి పాలక వర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.
షెడ్యూల్ ఇలా..
ఎప్రిల్ మొదటి వారంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలంటూ ఆదేశించారు. ఏప్రిల్ 8న ముసాయిదా ఓటర్ల జాబితా, 12న ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలతో సమావేశాలు, 16న ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, 21న తుది జాబితాలను ప్రచురణను పూర్తి చేశారు. ఎన్నికల షెడ్యల్ ప్రకారం ఏప్రిల్ 22 నాటికి సర్పంచులు, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి తుది ఓటరు జాబితాను కూడా విడుదల చేశారు. ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఫోలింగ్ కేంద్రాలను గుర్తింపును కూడా పూర్తి చేశారు. మే 9న పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ప్రకటించిన అధికారులు, 10వ తేదీ నుంచి 13వరకు అభ్యంతరాలను స్వీకరించారు. 18న అభ్యంతరాలను పరిష్కరించి తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటించారు. ఇందుకు కావాల్సిన బ్యాలెట్ బాక్సులు, ఇంక్ బాటిళ్లను తదితర ఎన్నికల సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో అవసరమైన ఎన్నికల సామగ్రి అందుబాటులో లేకుంటే పొరుగు జిల్లా నుంచి సమకూర్చుకుంటారు. జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పేపర్ ముద్రించడానికి అనువైన ప్రింటింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేసే పని కూడా పూర్తయింది.
హనుమకొండలో 51 పోలింగ్ స్టేషన్లు..
హనుమకొండ జిల్లా పరిధిలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో 51 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. ఎల్కతుర్తి మండలంలోని సూరారం, హసన్‌పర్తి మండలంలోని నాగారం, ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి, కమలాపూర్ మండలంలోని అంబాల, గూనిపర్తి గ్రామాల సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే విధంగా ఆత్మకూరు గ్రామం 10వ వార్డు, లింగమాడుగుపల్లెలో 5వ వార్డు, భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సంగాపూర్‌లో 4వ వార్డు, ముత్తారంలో 7వ వార్డు, దామెర మండలంలోని ముస్త్యాలపల్లిలో 3వ వార్డు, సింగరాజుపల్లిలోని 8వ వార్డుకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో మంత్తం 15,332మంది ఓటర్లు ఉండగా సర్పంచ్ స్థానాలకు 11,659మంది, వార్డు సభ్యులకు 3,679మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
– హనుమకొండ జిల్లాలో 5 సర్పంచులు, 3 ఎంపీటీసీలు, 21 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సర్పంచ్ స్థానాల్లో ఒంటిమామిడిపల్లి, సూరారం, నాగారం, అంబాల, గునివర్తి ఉన్నాయి. ఎంపీటీసీల్లో భీంపల్లి, గుండేడు (కమలాపూర్), సర్వాపూర్ (నడికుడ) ఉన్నాయి.
– జనగామ జిల్లాలో 8 సర్పంచ్, 2 ఎంపీటీసీ, 41వార్డు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. స్టేషన్ ఘన్‌పూర్ మంలం శివునిపల్లి, ఇప్ప గూడెం, దేవరుప్పుల మండలం సీత్వాతండా, రంబోజీగూడెం, పాలకుర్తి మండలం రాఘవపూర్, రఘునాథపల్లి మండలం కోడూరు, జనగామ మండలం గోపరాజుపల్లి, బచ్చన్నపేట మండలం లక్ష్మాపూర్‌లో సర్పంచ్, జనగామ మండలం వడ్లకొండ, తరిగొప్పుల మండలం అంకుషాపూర్ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
– మహబూబాబాద్ జిల్లాలో 5 సర్పంచ్, 3 ఎంపీటీసీ, 62 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సర్పంచ్ స్థానాల్లో నెల్లికుదురు మండలం నైనాల, బయ్యారం మండలం రుసలాపూర్, గూడూరు మండలం లయన్ తండా, కేసముద్రం మండలం ఉప్పరపల్లి, కురవి మండలం గుండ్రాతి మడుగు ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో బయ్యారం ఉప్పలపాడు, చిన్నగూడూరు మండలం ఇస్సంపల్లి, దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
– ములుగు జిల్లాలో 2 సర్పంచ్, 1 ఎంపీటీసీ, 33 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సర్పంచ్ స్థానాల్లో తాడ్వాయి మండలం కాల్వపల్లి, వాజేడు మండలం ధర్మవరం ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో ములుగు మండలం జంగాల పల్లి ఉంది.
– జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 7 సర్పంచ్, 30 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు ఖాళీలు లేవు.
– వరంగల్ జిల్లాలో 5 సర్పంచ్, 2 ఎంపీటీసీ, 40 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.