వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ, ది.నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన స్వధార్ మహిళా ఆశ్రమంలో పర్యావరణ పరిరక్షణలో మానవ పాత్ర అను అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు డాక్టర్ అనితా రెడ్డి బహుమతులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ గురించి వివరించి, పర్యావరణను కాపాడుకోకపోతే రానున్న కాలంలో జీవించడం కష్టమన్నారు. మన జీవన విధానాలతో పర్యావరణం కాలుష్యమవుతుందని హెచ్చరించారు. ప్లాస్టిక్ వినియోగం, చెట్లను నరకడం వలన అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. ఆధునిక యంత్రాలు వినియోగం పెరగడం, నియంత్రణ లేకపోవడం, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు అధికంగా వాడటం తద్వారా, భూగోళం వేడెక్కి జీవరాశులకు పెద్ద ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ చెట్లను, వివిధ జీవ జాతులను పరిరక్షించాలన్నారు. ప్లాస్టిక్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు తక్కువగా వాడి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. ప్రతి పౌరుడు భూతాపాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని, ప్రతి పౌరుడు జంతువుల్ని, వృక్ష జాలాన్ని పరిరక్షించుకోవాలన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం పెంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు విరివిగా అవలంభించాలన్నారు. అంతరించే ప్రమాదం ఉన్న జీవ జాతులను పునః ప్రతిష్ట చేసి రక్షించాలని తెలిపారు. విద్యార్థులు, యువత, ప్రజల్లో అవగాహన కలిగించాలని, జీవులని మనం రక్షిస్తేనే జీవ వైవిధ్యం మనల్ని రక్షిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, స్వధార్ నిర్వహకురాలు శైలజ పాల్గొన్నారు.
