- వివాదాస్పద ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్
- 12 స్థానాల్లో విజయం సాధించేలా పక్కా ప్లాన్
- త్వరలో నియోజకవర్గానికో ఇన్‌చార్జి..
- పార్టీ సీనియర్ నేతలకు బాధ్యతలు
- నాయకులను గాడిలో పెట్టే పనిలో జిల్లా అధ్యక్షులు
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తోంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌లోని 12 స్థానాలకు గానూ 8 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా, 2018 ఎన్నికల్లో 10మంది గులాబీ అభ్యర్థులు విజయం సాధించారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచినప్పటికీ తర్వాత టీఆర్ ఎస్‌లో చేరడంతో వారి సంఖ్య 11కు చేరింది. అయితే రానున్న ఎన్నికల్లో 12 స్థానాల్లో టీఆర్ ఎస్ జెండా ఎగురవేసేలా అధిష్ఠానం ప్రణాళికలు రూపొందిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించడంతోపాటు త్వరలోనే నూతనంగా నియోజకవర్గానికో ఇన్‌చార్జిని నియమించే పనిలో పడ్డారు. పార్టీ సీనియర్ నేతకు ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
-వరంగల్ వాయిస్, వరంగల్
వరంగల్ వాయిస్, వరంగల్ : వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీఆర్ ఎస్ అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై అధిష్ఠానం నిఘా పెంచింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే రిపోర్టుల ఆధారంగా ఇప్పటికే నియోజకవర్గాల్లో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించడంతోపాటు గాడితప్పుతున్న ప్రజా ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పనితీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో సఖ్యతలేని వారికి కూడా తనదైన రీతిలో వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీని గాడిలో పెట్టే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఇటీవల ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్ పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతోపాటు నాయకుల్లో సఖ్యత ఏర్పరిచేందుకు ప్రయత్నించారు.
12 స్థానాలు మనవే..
ఉమ్మడి జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని అధిష్ఠానం సూచిస్తోంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌లోని 12 స్థానాలకు గానూ 8 స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా, 2018 ఎన్నికల్లో 10మంది విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థలు ములుగులో సీతక్క, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. తర్వాత గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ ఎస్ బలం 11కు చేరింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి జిల్లాలో టీఆర్ ఎస్ క్లీన్ స్వీప్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ములుగుపై ప్రత్యేక దృష్టి..
ములుగు నియోజకవర్గంలో ఎదరులేని నేతగా వెలుగొందుతున్న సీతక్కపై టీఆర్‌ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు, గ్రామస్థాయిలో క్యాడర్ బలంగా ఉందని నివేదికలు వచ్చిన నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములుగు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలుత మంత్రి సత్యవతి రాథోడ్ పేరు వినిపించినా ఆమె మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలపైనే ఆసక్తి చూపడంతో ప్రత్యామ్నాయంపై అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీ టికెట్‌పై ఆసక్తి, ఆశలు పెట్టుకున్నవారి పేర్లను పరిశీలిస్తున్నారు. తాడ్వాయి జడ్పీటీసీ బడె నాగజ్యోతి, ములుగు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి అల్లం అప్పయ్యతోపాటు మునిసిపల్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న భూక్య దేవ్‌సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ములుగు నియోజకవర్గంలో ఆదివాసీ ఓటర్లే అధికంగా ఉండడంతో ఆ సామాజిక వర్గం నేతలకే టికెట్లు దక్కే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నియోజకవర్గానికో ఇన్‌చార్జి..
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించిన అధికార పార్టీ త్వరలోనే నియోజకవర్గానికో ఇన్‌చార్జిని నియమించే పనిలో పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా నియోజకవర్గ నాయకుల్లో సమన్వయం లేని విషయాన్ని అధిష్ఠానం గుర్తించింది. వారందరినీ ఒకే తాటి మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జిని నియమించాలని అధిష్ఠానం భావిస్తోంది. పార్టీ సీనియర్ నేతలకు ఈ బాధ్యతలను అప్పగించనున్నారు. అందులో భాగంగా సదరు నియోజకవర్గానికి ఏ మాత్రం సంబంధంలేని ఇతర జిల్లాల వారిని ఎలాంటి వివాదాలు, అభియోగాలు లేని పార్టీ అధిష్ఠానానికి విధేయులై పనిచేసేవారిని గుర్తించే పనిలో పడ్డారు. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా వీరు పనిచేయనున్నారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేయడంతోపాటు పార్టీ శ్రేణులు, ప్రజలతో భేటీ అవుతూ వారి అభిప్రాయాలను ఎప్పటికప్పుడూ అధిష్ఠానానికి తెలియజేస్తారు. అసమ్మతి, అసంతృప్తి, ఇతర సమాచారాన్ని కూడా అధినాయకులతో పంచుకుంటారు. నియోజకవర్గంలో పార్టీ పరమైన వ్యవహారాలను సమన్వయం చేస్తూ అధిష్ఠానం ఇచ్చే ఆదేశాలను నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు అమలు చేస్తుంటారు.
