- అంకితభావంతో చదివితేనే అందలం
- మీ భవిష్యత్ కు మీరే మార్గనిర్దేశకులు
- ప్రణాళిక, సమయ పాలన అవసరం
- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థ సారథి
- నల్గొండ జిల్లా కేంద్రంలో
- ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు
‘‘మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు.. ప్రణాళికా బద్ధంగా, సమయ పాలన పాటిస్తూ కసిగా కష్టపడితే ప్రభుత్వ కొలువు సాధించడం కష్టమేమి కాదు.. బద్దకం, వాయిదా వేయడం, నిరాశ, , ఆత్మన్యూనతా వంటి లక్షణాలు విడనాడాలి.. పాజిటివ్ దృక్పథంతో ముందుకు నడువాలి’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థ సారథి ఉద్యోగార్థులకు పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో పోటీపరీక్షలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్థ సారథి మాట్లాడుతూ.. బుక్ స్టాల్ లో కనపడే ప్రతీ పుస్తకం కొనవద్దని, ఒక సబ్జెక్ట్ కు ఒకే ప్రామాణిక పుస్తకాన్ని చదివి నోట్స్ రాసుకోవాలన్నారు. దాన్ని పదే పదే రివిజన్ చేయాలన్నారు. రాష్ట్రంలో కొలువులు వరుస కట్టాయని, ఈ సువర్ణావకాశాన్ని అభ్యర్థులు వదులుకోవద్దన్నారు.
వరంగల్ వాయిస్, నల్గొండ: అంకిత భావం, పట్టుదల, ఏకాగ్రతతో చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఉద్బోధించారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో జిల్లా యంత్రాంగం తరపున పోటీ పరీక్షలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన హాజరై విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతున్న నేపథ్యంలో, యువత అందివచ్చిన ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉన్నత స్థానంలో వుంటే ప్రజలకు సేవ చేసే అవకాశం, తృప్తితో పాటు కుటుంబ జీవనానికి సుస్థిరత లభిస్తుందని చెప్పారు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని పైకి వచ్చిన వాళ్లమే ఇక్కడ మీముందు ఉన్నామని ఉద్యోగార్థులకు ప్రేరణ కలిగించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఇతర జిల్లా అధికారులు అందరూ కష్టపడే ఉన్నత స్థాయికి వచ్చారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదివి ఐఏఎస్ అధికారిగా, జిల్లా కలెక్టర్ గా ప్రజలకు సేవలు అందించానని తెలిపారు. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, కసితో ఇష్టపడి, ప్రణాళిక బద్ధంగా చదివి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పరీక్షా సమయంలో మనం ఇన్ని రోజులు చదివిన అంశాలతో పాటు మన బుద్ధికి కూడా పరీక్షే అన్నారు. పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జి మొదలగు సబ్జెక్టుల వారీగా చదవాలన్నారు. ఒక సబ్జెక్టును చాప్టర్ గా విభజించుకుని చదివి ముఖ్యమైన అంశాలను నోట్ బుక్ లో రాసుకోవాలని సూచించారు. ఒక సబ్జెక్టుకు ఒక పుస్తకాన్ని మాత్రమే ఎంచుకుని చదవాలని బజార్లో దొరికే అనేక రకాల పుస్తకాలను చదివి సమయాన్ని కోల్పోవద్దని సూచించారు. పరీక్షా సమయం దగ్గర పడుతున్నందున సెల్ ఫోన్ కు, సినిమాలకు, చాటింగ్ లకు దూరంగా ఉండాలన్నారు. బద్దకం, వాయిదా వేయడం, భయం, నిరాశ, నిందారోపణలు, మొహమాటం, ఆత్మన్యూనతా విడనాడి పాజిటివ్ దృక్పథంతో, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నారు. పరీక్షలలో ఇంటర్వ్యూ తీసివేశారని, కష్టపడి పరీక్షలో ఎక్కువ మార్కులు సాధిస్తేనే ఉద్యోగం పక్కాగా వస్తుందని తెలిపారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నందున మీరే తీర్చిదిద్దుకోవాలని సూచించారు. నల్లగొండ జిల్లాకు చారిత్రక నేపథ్యం ఉందని, అనేక సంఘటనలు, వ్యక్తులు, చారిత్రక నేపథ్యం గురించి వివరించారు. స్వాతంత్ర సంగ్రామం, సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో జిల్లా కీలక భూమిక పోషించినదన్నారు. జిల్లా నుంచి ప్రభుత్వ కొలువులు ఎక్కువ సాధించాలని, మళ్లీ జిల్లాకు వస్తానని, ప్రభుత్వ కొలువులు సాధించిన వారితో మాట్లాడి సన్మానం చేస్తానని ఉత్సాహపరిచారు.
కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఎన్నికల కమిషనర్ బోధించిన అంశాలను అవగాహన చేసుకుని ఉద్యోగం సాధించాలన్నారు. ఈ అవగాహన సదస్సుకు హాజరైన అభ్యర్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అనేక అంశాల గురించి బోధించారు. సదస్సులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు పాల్గొని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి పుష్ప లత, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బాలకృష్ణ, తహసీల్దార్ నాగార్జున, సుమారు వెయ్యి మంది ఉద్యోగార్థులు పాల్గొన్నారు.
పోలీసుల గౌరవ వందనం..
అంతకుముందు రోడ్లు భవనాలు శాఖ అతిథి గృహం వద్ద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయనకు కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీపీవో విష్ణు వర్ధన్, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డీపీఆర్ వో శ్రీని వాస్ ఘనంగా స్వాగతం పలికి మొక్కలు అందచేశారు.
జిల్లాల వారీగా ప్రేరణ కలిగిస్తూ..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్ని జిల్లాల్లో తిరుగుతూ తమదైన శైలిలో ఉద్యోగాలు, పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఉద్యోగార్థులకు సూచనలు, సలహాలిస్తున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించి గురువారం నల్గొండ జిల్లాకు వచ్చారు. ఆయన చెబుతున్న విషయాలకు ఉద్యోగార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.













