- అబ్దుల్ కలామే అందుకు నిదర్శనం
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- పాలకుర్తి జడ్పీ పాఠశాలలో అబ్దుల్ కలామ్ విగ్రహావిష్కరణ
వరంగల్ వాయిస్, పాలకుర్తి: పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని, అందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ జీవితమే నిదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏపీజే అబ్దుల్ కలామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పదో తరగతి ఫలితాల్లో అత్యంత ప్రతిభను కనబరచిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఉత్తమ సేవలు అందించిన స్కూల్ అటెండర్ భిక్షపతిని మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీవితమంతా శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, సమాజం కోసం పాటుపడిన మహనీయుడు డా. ఏపీజే అబ్దుల్ కలాం అని, నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమన్నారు. కలలు కను… వాటిని నిజం చేసుకోమని చెప్పిన మహానుభావుడు అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. విగ్రహ ఏర్పాటుకు సారథ్యం వహించిన హెల్పింగ్ హ్యాండ్స్ గంట రవీందర్ ను అభినందించారు. వందేమాతరం రవిందర్ రావు, గంటా రవిందర్ ఎంతో సేవ చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పదో తరగతిలో 10/10 మార్కులు వచ్చిన 5 గురికి గంటా రవిందర్ తమ స్వచ్ఛంద సంస్థ మహాత్మా హెల్పింగ్ హ్యాండ్ తరపున తలా 10వేల చొప్పున పంపిణీ చేశారు. వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ తక్కెళ్ళ పల్లి రవిందర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.