వరంగల్ వాయిస్, తొర్రూరు : మండలంలోని వెలికట్టే గ్రామంలో గల స్థానిక రామ ఉపేందర్ ఫంక్షన్ హాల్ లో గురువారం వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల సన్నాహాక సమావేశం పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి సభాధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు పరిష్కారం కావాలంటే తీన్మార్ మల్లన్నను గెలిపించవలసిన అవసరం పట్టభద్రులకు ఉందన్నారు. గతంలో పట్టభద్రులు పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల గురించి ఏనాడు కూడా రాష్ట్ర శాసనమండలిలో మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులను పూర్తిగా విస్మరించాడని విమర్శించారు. ఎమ్మెల్సీ పదవీ పూర్తి చేయకుండానే తనకు ఉన్నటువంటి ఆస్తులను కాపాడుకోవడం కోసం జనగామ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం జరిగిందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల విషయంలో 317 జీవోను ప్రవేశపెట్టి ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను అనేక ఇబ్బందులను గురి చేశాడని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయి పాలన చేశారని ఎద్దేవా చేశారు. గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు. పట్టభద్రుల ఓటును అడిగే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు లేదంటూ కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే నాలాంటి వ్యక్తికి పట్టభద్రులు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర శాసన మండలికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
