- నూతన గణేష్ మండపాల సమాచారాన్ని ఇవ్వండి
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
వరంగల్ వాయిస్, వరంగల్ : మన పండుగలు మతసామరస్యానికి ప్రతీకలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. రానున్న వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగలను పురస్కరించుకొని సెంట్రల్ జోన్ పోలీసుల అధ్వర్యంలో శాంతి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్ లో నిర్వహించారు. ట్రై సీటీ పరిధిలోని వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో పాటు, గణేష్ నవరాత్రి మండళ్ళ నిర్వహకులు పాల్గొన్న ఈ సామవేశానికి సీపీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గతంలో ఎన్నడు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని. ఇదే సంస్కృతిని కోనసాగిస్తూ ఈ సారి కూడా శాంతియుతంగా పండుగలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు సహకరించాలన్నారు. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారులకు తప్పకుండా తెలియచేయాలన్నారు. అందువలన మండపం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే అవకాశం ఉంటుందన్నారు. గణేష్ మండపాల వద్ద భాద్యత కలిగిన నిర్వహణ కమిటీ సభ్యులు, సీసీ కెమెరాలు ఏర్పాటు, షాట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డీసీపీ బారి, ఏసీపీలు బోనాల కిషన్, డేవిడ్ రాజు, జితేందర్ రెడ్డి, భోజరాజు, ఇన్సెస్పెక్టర్లు, ఎస్.ఐలతో పాటు మత పెద్దలు భద్రకాళి దేవాస్థానం ప్రధాన పూజరి శేషు, తెలంగాణ అర్చన సంఘం అధ్యక్షుడు గంగు ఉపేందర్ శర్మ, కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, మైనార్టీసెల్ సభ్యుడు దర్శన్ సింగ్, సామ్యూల్, అతీఖ్ రహమాన్, గణేష్ ఉత్సవ కమిటీ కో ఆర్డినేటర్ జైపాల్ రెడ్డి, ఉదయ్ కుమార్ మరికొందరు మత పెద్దలు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేస్తే నేరాల నియంత్రణ సులభం..
ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులతో సమన్వయంతో పనిచేస్తే నేరాల నియంత్రణ సాధ్యపడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. వరంగల్ కమిషనరేట్ లో కొద్ది రోజుల క్రితం వివిధ ఆపార్టమెంట్లలో జరిగిన వరుస చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టుతో పాటు, వారి నుంచి రూ. 2 కోట్ల విలువైన రెండు కిలోల పైగా బంగారు అభరణాలు స్వాధీనం చేసుకోవడంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ దర్యాప్తు బృందానికి పూర్తి సహకారాన్ని అందించిన కర్నూలు జిల్లా నాల్గవ పట్టణ ఇన్ స్పెక్టర్ శంకరయ్యతో పాటు స్టేషన్ కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, నాగరాజులను గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అంతరాష్ట్ర నేరస్థులను పట్టుకోవడంలో ప్రధాన భూమిక పోషించిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.