- తెలంగాణ పథకాలపై ఫోకస్ పెట్టనున్న కెసిఆర్
వరంగల్ వాయిస్, నాందేడ్: టిఆర్‌ఎస్ పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్చిన తరవాత తన తొలి అడుగును మహారాష్ట్ర నాందేడ్‌లో మోపబోతోంది. కెసిఆర్ నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్న క్రమంలో నాందేడ్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తన వాణిని వినిపించబోతున్నారు. తెలంగాణలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను దేశానికి పరిచయం చేయబోతున్నారు. ప్రజలు కూడా వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో మొదటిసారి ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా చేరికలపై ప్రధాన దృష్టి సారించారు. 5న ఆదివారం నాందేడ్‌లో జరుగబోయే బీఆర్‌ఎస్ సమావేశంలో కేసీఆర్ కీలక ప్రసంగం చేయబోతున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడుంటే దేశం బాగుపడుతుందని, ఆయన దూరదృష్టి ఉన్న నాయకుడని స్థానిక రైతులు కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తు లాంటి పథకాల ప్రాదాన్యతను వివరించబోతున్నారు. నాందేడ్ సభ సందర్భంగా పలు కూడళ్లలో బీఆర్‌ఎస్ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. నాందేడ్ సభ దృష్ట్యా తెలంగాణ సరిహద్దు జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు జట్లుగా విడిపోయి ఆయా నియోజకవర్గాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల్లో ప్రజలు తెలంగాణ సర్కారు, సంక్షేమ పథకాల గురించి వివరించి చైతన్యం చేశారు. ముఖ్యంగా వృద్దాప్య పెన్షన్లు ఎంత ఇస్తున్నదీ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. షాదీముబారక్ పథకం ఎందరో పేద ముస్లిం ఆడపిల్లలకు వరంగా మారింది అంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ పథకాలను బహుళ ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం చేయడం కోసం నాందేడ్ సభను వినియోగించుకోబోతున్నారు.
