వరంగల్ వాయిస్, హనుమకొండ : ఈ భూమిపై ఉన్న సమస్త జీవరాసులను, వృక్ష సంపదను, జల వనరులను, ప్రకృతిని సంరక్షించి కాపాడుకోవడం రాబోవు తరాల వారికి మన అందించే విలువైన బహుమతి అని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ప్రముఖ సామాజికవేత్త, వన సేవ సభ్యుడు నిమ్మల శ్రీనివాస్ అన్నారు. “అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం “సందర్భంగా బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ధరిత్రిపై ఉండే జీవరాశుల వలన జీవ సమతుల్యం ఏర్పడుతుందని, వీటిలో ఏ జీవి మనుగడకైనా నష్టం వాటిల్లితే అది మిగిలిన జీవరాశులపై ప్రభావం చూపి జీవవైవిద్యానికి విఘాతం కలిగిస్తుందని అన్నారు. పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే ఈ విషయాలపై ఆసక్తి పెంచడానికి వారి పాఠ్యాంశాలలో భాగంగా “ఎన్విరాన్ మెంటల్ సైన్స్”(ఈవీఎస్) అనే సబ్జెక్టును ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఉపాధ్యాయులు కూడా చిన్నారులకు విషయాలను బోధించి వారిని ప్రకృతి ప్రేమికులుగా మార్చాలని ఆయన కోరారు.
