Warangalvoice

IMG 20220803 WA0063 1

నిరంతర సాధనే – విజయమార్గం

  • ప్రణాళికతో చదివి విజేతగా నిలువండి
  • పట్టుదలతో ఇష్టపడి చదవాలి
  • చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు

‘‘సిలబస్ పై పట్టు.. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం.. నిరంతర సాధన..’’ ఇవే పోటీపరీక్షల్లో విజేతగా నిలువడానికి విజయ సూత్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఉద్బోధించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీపరీక్షలపై ఉద్యోగార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మార్గనిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతో చదవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. ప్రతీ నిమిషం కీలకమేనని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే విజయానికి దగ్గరవుతారని సూచించారు. అంకిత భావంతో చదివి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని అభ్యర్థులను ఉత్సాహపరిచారు.

వరంగల్ వాయిస్, కామారెడ్డి: ప్రణాళికతో చదివితే విజయం సొంతం చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి మందిరంలో బుధవారం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మార్గ నిర్దేశం చేశారు. ఉద్యోగ సాధనలో భాగంగా అభ్యర్థులు పాటించవలసిన మెలకువలను ఆకట్టుకునే రీతిలో వివరిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. తన స్వీయ అనుభవాలను జోడించి పలు అంశాలపై అవగాహన కల్పించి వారిలో ప్రేరణ కలిగించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. అపజయం ఎదురైనంత మాత్రాన ప్రయత్నించడం ఆపకూడదని ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమై కోరుకున్న ఉద్యోగం సాధించాలన్నారు. సిలబస్ పై పట్టు కలిగి ఉండాలని సూచించారు. పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకుంటూ, పరీక్ష విధానానికి అనుగుణంగా సిద్ధం కావాలని పేర్కొన్నారు. అనవసర సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. పోటీ పరీక్షల వాతావరణంలో ఏకాగ్రతతో సిద్ధం కావాలని కోరారు. పరీక్షల్లో ప్రతి ప్రశ్న కీలకమని, ప్రిపరేషన్ లో నిర్లక్ష్యం ఉండొద్దని సూచించారు. ఉద్యోగ సాధనలో ఎదురయ్య అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు పోవాలని కోరారు. గతంతో పోలిస్తే ఈసారి అభ్యర్థులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకొని కొలువు దక్కేలా కృషి చేయాలని సూచించారు. తమపై తాము గట్టి నమ్మకంతో కష్టపడ్డప్పుడు విజేతలుగా నిలుస్తారన్నారు. యువత దురాలవాట్లకు దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగాలని కోరారు. ఏకాగ్రత, స్థిరత్వంతో విషయపరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. బట్టి విధానానికి స్వస్తి పలికాలన్నారు. పోటీ పరీక్షల్లో రాణించేలా అన్ని సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంపైనే దృష్టి సారించాలని ఉద్బోధించారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నుంచి వస్తున్న నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదో సువర్ణ అవకాశమని, ఇలాంటి అవకాశం మళ్లీ రాకపోవచ్చన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ విప్లవం వచ్చిందని, ఇప్పటికే గ్రూప్ -1, , ఎస్సై, కానిస్టేబుల్ తదితర నోటిఫికేషన్లు వచ్చాయని చెప్పారు. త్వరలోనే గ్రూప్- 2,4 ఇతర ఉద్యోగ ప్రకటనలు కూడా రానున్నాయని వివరించారు. గ్రూప్ -1 కు సంబంధించి ప్రిలిమినరీ, మెయిన్స్ లో అడిగే ప్రశ్నలు, అందుకోసం అభ్యర్థులు ఎలా చదవాలో విశ్లేషణాత్మకంగా తెలియజేశారు. పక్కా ప్రణాళికతో సంసిద్ధులైతే ఉద్యోగం సాధించడం సులభం అవుతుందని చెప్పారు. ఏకాగ్రతతో చదివి యువతి, యువకులు తాము కోరుకున్న ఉద్యోగాన్ని దక్కించుకొని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టర్ జితేష్ వీ పాటిల్ మాట్లాడుతూ.. వివిధ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఎస్సీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తున్నామన్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్లు వెలవడినప్పుడు చూపిన ఉత్సాహాన్ని పరీక్ష పూర్తి చేసే వరకు నిరంతరం కొనసాగించాలన్నారు. సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ లావణ్య మాట్లాడుతూ.. సౌత్ క్యాంపస్ అభివృద్ధికి అప్పటి తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ పార్థసారథి చేసిన కృషిని కొనియాడారు. సౌత్ క్యాంపస్ లోపలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఏఎస్పీ అన్యోన్య, ఆర్టీవో వాణి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కిష్టయ్య, జిల్లా అదనపు సమాచార, పౌర సంబంధాల అధికారి మల్లికార్జున్ పాల్గొన్నారు.
కామారెడ్డి లో ఘన స్వాగతం..
కామారెడ్డిలో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల అవగాహన సదస్సు వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధికి మార్గమధ్యంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఏ ఎస్ పీ అన్యోన్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఉన్నతాధికారులతో జిల్లా ప్రగతిపై ముచ్చటించారు.

State Election Commissioner C. Parthasarathy
State Election Commissioner C. Parthasarathy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *