- నడుం బిగించిన బల్దియా
- అడ్డంకుల గుర్తింపునకు నాలుగు ప్రత్యేక బృందాలు
- అసంపూర్తి నిర్మాణాలపై కమిషనర్ సీరియస్
- ‘వరంగల్ వాయిస్’ కథనాలతో స్పందన
నగరం ముంపునకు కారణమవుతున్న నాలాలపై వరంగల్ మహా నగరపాలక సంస్థ నజర్ పెట్టింది. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను త్వరితగతిన గుర్తించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వరద నీరు సాఫీగా వెళ్లకుండా అడ్డుపడుతున్న ఆక్రమణల తొలగింపునకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు సిద్ధపడుతోంది. ‘వరంగల్ వాయిస్’ దినపత్రికలో వరుసగా వస్తున్న కథనాలకు బల్దియా కమిషనర్ స్పందించారు. రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, ల్యాండ్ సర్వే, పోలీస్ అధికారులతో కలిపి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం కమిషనర్ పి.ప్రావీణ్య ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. అసంపూర్తి నిర్మాణాలపై సీరియస్ అయ్యారు. అధికారులంతా సమన్వయంలో పనిచేసి పూర్తి వివరాలను జిల్లా టాస్క్ ఫోర్స్ టీంకు సమర్పించాలని ఆదేశించారు.
-వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి
వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: నగరంలో వరద ముంపు నివారణ చర్యలకు బల్దియా అధికారులు శ్రీకారం చుట్టారు. వరద నీరు సాఫీగా వెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధపడుతున్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో కమిషనర్ ప్రావీణ్య అధ్యక్షతన నాలాల అడ్డంకుల గుర్తింపునకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నాలాలపై ఉన్న నిర్మాణాలను సమర్థవంతంగా గుర్తించేందుకు దిశా నిర్దేశం చేశారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి బృందంలో రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, ల్యాండ్ సర్వే, ఎస్సై స్థాయి పోలీస్ అధికారులు ఉంటారని ప్రకటించారు. వీరికి పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ టీం లీడర్‌గా వ్యవహరిస్తారని వెల్లడిరచారు. నగరంలో అత్యంత ప్రమాదకారిగా మారిన నయీం నగర్, భద్రకాళి, సాకరాసి కుంట, బొంది వాగు నాలా, చిన్న వడ్డేపల్లి, కట్ట మల్లన్న నాలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నాలాలు ప్రభావితం అయ్యే ఏరియా, బఫర్ జోన్‌ల వివరాలను మ్యాపుల సహాయంతో గుర్తించి జిల్లా టాస్క్ ఫోర్స్ టీంకు సమర్పించాలని ఆదేశించారు. వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ మాట్లాడుతూ.. నాలాలను ఆనుకొని ఉన్న నిర్మాణాలను పారదర్శకంగా గుర్తించాలని సూచించారు. టీంలో ఉన్న వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభావిత ప్రాంతాల నివేదికలు సకాలంలో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ వెంకన్న, హనుమకొండ ఆర్‌డీవో వాసు చంద్ర, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, ల్యాండ్ సర్వే, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ చర్చ..
ఇటీవల జరిగిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో నగరంలోని నాలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలు, లే-అవుట్లపై సీరియస్ చర్చ జరిగింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డాక్టర్ బి.గోపితోపాటు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, నగర పాలక సంస్థ కమిషనర్ పి.ప్రావీణ్య పాల్గొని ముంపు నుంచి నగర ప్రజలను రక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అక్రమ నిర్మాణాలు, లే-అవుట్లపై చర్యలు తీసుకోవాలని, నూతనంగా ధరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించే విధంగా వారికి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే గుర్తించిన వివిధ నాలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
2020లోనే మంత్రి హామీ..
వరంగల్ నగరాన్ని వరద నీరు ముంచెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని, అందుకు ఎంత ఖర్చైనా వెనుకాడేది లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు 2020లోనే భరోసా ఇచ్చారు. ముంపు చర్యలు చేపట్టేందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేశారు. కాని మొద్దునిద్రలో ఉన్న బల్దియా పాలకులు, అధికారులు విడుదలైన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. దీంతో రెండు సంవత్సరాల క్రితం చేపట్టిన చాలా పనులు ఇప్పటికీ పెండిరగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముంపు బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామంటూ ప్రకటించారు.
పక్కా ప్రణాళికతో ముందుకు..
నాలాల అడ్డంకుల గుర్తింపునకు ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బృం దాలు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలని అధికారులు సూచించారు. ప్రతి బృందం క్షేత్ర స్థాయిలో నాలాలను పరిశీలించడంతోపాటు వాటితో ప్రభావితం అయ్యే ఏరియా, బఫర్ జోన్‌ల వివరాలను మ్యాపుల సహాయంతో గుర్తించి జిల్లా టాస్క్ ఫోర్స్ టీంకు సమర్పించాలని ఆదేశించారు. దీంతో నాలాల అక్రమణ ఎంత వరకు జరిగింది..చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
త్వరితగతిన పూర్తి చేయాలి..
నగరంలోని నాలాలపై ఆక్రమణలను గుర్తించడంతోపాటు వాటిని త్వరితగతిన తొలగించాలని ముంపు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. చినుకు పడిరదంటేనే ముంపు ప్రాంత ప్రజల ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముంపు లేని నగరంగా తీర్చిదిద్దాలని వేడుకుంటున్నారు.



