- ఏ విద్యార్హత లేకున్నా వైద్యం
- నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- వివరాలు వెల్లడించిన సీపీ డా. తరుణ్ జోషి
వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ నగరంలో ఏలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ తో పాటు అతడి సహాయకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నకిలీ డాక్టర్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్ ట్యాప్, మూడు సెల్‌ఫోన్లు, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వరంగల్ నగరానికి చెందిన ముజతాబా ఆహ్మద్, మరో నిందితుడు దామెరకొండ సంతోష కుమార్ వున్నారు. అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ముజతాబా ఆహ్మద్ బి.ఫార్మసీ చదువు మధ్యలో అపివేసి స్థానికంగా వున్న డాక్టర్ వద్ద సహాయకుడిగా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు. నిందితుడు అహ్మద్ సహాయకుడిగా పనిచేయడం ద్వారా ఆదాయం సరిపోకపోవడంతో పాటు మరింత డబ్బును సంపాదించాలనుకున్నాడు. ఇందుకోసం ప్రధాన నిందితుడు శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ అవతారాన్ని ఎత్తాడు. ఇందుకోసం నిందితుడు నకిలీ ఎయిమ్స్ వైద్య విభాగం నుంచి పొందిన తరహలో తన పేరు మీదగా నకిలీ సర్టిఫికేట్ తయారు చేసుకోని, ఈ నకిలీ సర్టిఫికేట్ ద్వారా నిందితుడు మరో నిందితుడు ల్యాబ్ టెక్నిషియన్ అయిన సంతోష్ కుమార్ తో కలిసి వరంగల్ చింతల్ ప్రాంతంలో హెల్త్ కేర్ ఫార్మసీ పేరుతో 2018 సంవత్సరంలో హాస్పిటల్ ప్రారంభించి ఎం.బి.బి.ఎస్ డాక్టర్ గా ప్రజలకు వైద్యం అందించడంతో పాటు, తన ల్యాబ్లో వైద్య పరీక్షలు నిర్వహించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు. అదే విధంగా తన ల్యాబ్ లో చేసిన వైద్య పరీక్షలను అసరాగా చేసుకోని నిందితుడు చికిత్స కోసం వచ్చిన రోగులను రోగం పేరుతో భయభ్రాంతులను చేసి వారిని నగరంలోని ఇతర హాస్పిటల్స్ కు పంపించేవాడు. ఇలా ఇతర హాస్పిటళ్లకు రోగులను పంపించినందుకుగాను నిందితుడు సదరు యాజమాన్యం నుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు స్వీకరించేవాడు. నాలుగు సంవత్సరాలుగా నిందితుడు సుమారు 43వేల మంది రోగులను పరీక్షించాడు. ఈ నకిలీ డాక్టర్ వ్యహరానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు నకిలీ డాక్టర్ హాస్పిటల్ తనిఖీ నిర్వహించడంతో ఈ నకిలీ డాక్టర్ వ్యవహారం బయటపడటంతో నిందితులను పోలీసులు అరెస్ట్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషను తరలించారు. ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు నరేష్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎస్.ఐలు లవణ్ కుమార్, అనిల్ హెడ్ కానిస్టేబుళ్ళు శ్యాంసుందర్, సోమలింగం, అశోక్, మాధవరెడ్డి, స్వర్ణలత, కానిస్టేబుళ్ళు శ్రవణ్ కుమార్, సృజన్, రాజేష్, నవీన్, ఆలీ, శ్రీను, నాగరాజు, సురేష్, రాజు, భిక్షపతి, శ్యామ్, శ్రీధరలను పోలీస్ కమిషనర్ కమిషనర్ అభినందించారు.
