- కేంద్రం సహకరించకున్నా ముందుకే
- పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్
వరంగల్ వాయిస్,కరీంనగర్: వరి ధాన్యం కొనుగోలు విషయంలో సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయం వల్లనే రైతులకు మేలు జరుగుతోందని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రం మొండికేసినా రాష్ట్రంలో చివరిగింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని లేదని రాష్ట్రమంత్రి పేర్కొన్నారు. కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్ ముందే రైతులకు సూచించారన్నారు. వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు విడిచిపెట్టలేదన్నారు. యాసంగి ధాన్యాన్ని నేరుగా కేంద్రమే కొనుగోలు చేయాలని అన్నారు. కేంద్రం ధాన్యం కొనకపోయినా గత కొన్నేళ్లుగా తామే కొనుగోలు చేస్తున్నామని అన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా ధాన్యం కొనాలని నిర్ణయించి అమలు చేస్తున్నామని అన్నారు. ముందునుంచీ తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం వరి ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని, కానీ కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి పీయూష్ గోయల్ అబద్దాలు చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాని ఆరోపించారు. వడ్లు కొనకుండా తప్పించుకోవాలని చూస్తే రాష్ట్రంలో బీజేపీకి పూర్తిగా నూకలు చెల్లినట్లేనని మంత్రి గంగుల హెచ్చరించారు. అన్నివిధాలుగా తెలంగాణను కేంద్ర అవమానిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానించిన విషయాన్ని గుర్తు చేశారు. మనల్ని నూకల తినమని చెప్పిన బీజేపీ నాయకులతోనే నూకలు తినిపిద్దామని అన్నారు. తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రంతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ తన దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ముంచే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో పండిన ప్రతి వరి, గోధుమ గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లను నియంత్రించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్న మంత్రి, రాష్టాల్రలో పండిన పంటలను ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు తరలించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాల వల్ల దేశంలో ఆకలి కేకల సూచీ అధ్వానంగా కింది స్థాయికి పడిపోయిందన్నారు.తెలంగాణ రాష్ట్రం వల్లే సోమాలియా తరహా ఆకలి కేకలు దేశంలో తప్పాయన్నారు. కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో ఒకలా ప్రవర్తిస్తున్న బీజేపీ దుర్మార్గపు రాజకీయాలకు చరమగీతం పాడాలని మంత్రి పిలుపు నిచ్చారు.
