- గంటన్నర వర్షం.. ఆగమాగం చేసింది..
- మహా నగరం అతలాకుతలం
- ఉప్పొంగిన డ్రైనేజీలు, నాలాలు
- ఎటూ చూసినా నీళ్లే
- ఎక్కడికక్కడా ట్రాఫిక్ జాంలు
వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నగరం జలమయమైంది. సోమవారం మధ్యాహ్నం చడీచప్పుడు లేకుండా ఒక గంట పాటు జోరు వాన కురిసింది. దీంతో నగరంలోని కాలనీలు జలమయమైపోయాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లాయి. హనుమకొండ బస్టాండ్ ప్రాంగణం అంతా నీళ్లు చేరాయి. అలాగే కేడీసీ మీదుగా పెద్ద ప్రవాహం వెళ్లడంతో బస్టాండ్ నుంచి అశోక జంక్షన్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాకాజీ కాలనీలో అంతటా నీళ్లు నిలిచిపోవడంతో రోడ్డుపై ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే నిట్ సమీపంలోని త్రివేణి సూపర్ మార్కెట్ ఎదుట హైదరాబాద్ రోడ్డుపై వెళ్తున్న వరద పెద్ద వాగును తలపించింది. మోకాళ్ల లోతు నీళ్లు వెళ్లడంతో బైక్, ఆటో, కార్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆ పక్కనే ఉన్న ఎస్బీహెచ్ కాలనీలోకి నీళ్లు చేరాయి. ములుగు రోడ్డు జంక్షన్ లో జలమయమైంది. దీంతో అర కిలో మీటర్ కు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. సర్కిల్ దాటి వెళ్లడానికి ఒక్కో వాహనానికి అరగంట పట్టింది.








