Warangalvoice

Triple R.. Follow .. Get Job..

త్రిపుల్‌ ఆర్‌.. పాటించు .. ఉద్యోగం సాధించు..

  • ‘‘రీడింగ్ రికార్డ్‌, రివిజన్‌ ’’ తో ప్రిపరేషన్‌ చేయండి
  • ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకెళ్లండి..
  • కష్టపడితే అత్యున్నత ఉద్యోగం మీ సొంతం
  • గ్రూప్‌-1 కొడితే సమాజంలో హోదా, ప్రజా సేవలో తృప్తి
  • సువర్ణావకాశాన్ని యువత వదులుకోవద్దు..
  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి
  • మహబూబ్‌ నగర్‌ లో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు

‘‘కృషితో నాస్తి దుర్భిక్షం.. కష్టే ఫలి అన్నారు పెద్దలు.. కష్టపడితే సాధించనిది లేదు.. ఆకాశమే హద్దుగా ఆత్మవిశ్వాసంతో అహర్నిషలు కష్టపడితే అత్యున్నత కొలువు మీ సొంతం..’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌ నగర్‌ లో గ్రూప్‌-1, ఎస్సై ఉద్యోగార్థుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.. అభ్యర్థులు సిలబస్‌ పై పట్టు పెంచుకుని, ‘‘రీడిరగ్‌, రికార్డ్‌, రివిజన్‌ ‘‘పద్ధతిలో ప్రిపరేషన్‌ కొనసాగించాలన్నారు. సబ్జెక్టును 360 డిగ్రీల కోణంలో ప్రణాళికబద్ధంగా చదవాలన్నారు. ప్రతి ఒక్కరిలో తమకు తెలియని శక్తి, సామర్థ్యాలు ఉంటాయని, వాటిని బయటకు తీసి విజయతీరాలకు చేరాలని స్ఫూర్తిని నింపారు. ప్రిపరేషన్‌ మెలకువలను విడమరిచి చెబుతూ వారిలో ఉద్యోగ కాంక్షను పెంచారు.
-వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ ప్రధాన ప్రతినిధి

వరంగల్‌ వాయిస్‌, మహబూబ్‌ నగర్‌ : ‘‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’’, ‘‘కృషితో నాస్తి దుర్భిక్షం’’, కష్టపడితే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని చరిత్రలో మనం ఎన్నో దృష్ట్యాంతాలు చూశాం. ఇవన్నీ అందరికీ తెలుసు. అయితే ఆచరణలో పెట్టేది మాత్రం కొందరే. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో తెలుగు మాధ్యమంలో కష్టపడి చదివి, గ్రూప్‌ వన్‌ అధికారిగా ఎంపికై అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్‌ అధికారిగా వివిధ శాఖలలో, వివిధ హోదాలలో సేవలందించి ఉద్యోగ విరమణ అనంతరం కూడా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గా పని చేస్తూ పదిమందికి తాను స్ఫూర్తినివ్వాలని, తనలాగా యువత ఐఏఎస్‌ సాధించి బంగారు తెలంగాణలో భాగస్వాములవ్వాలన్న సంకల్పంతో మార్గదర్శకంగా నిలిచారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి.
రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్‌ ఉద్యోగాలతో పాటు, పోలీస్‌, ఎస్‌ఐ కానిస్టేబుల్‌ ఉద్యోగాలను పెద్దఎత్తున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 8 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పెద్ద ఎత్తున ఉద్యోగాల జాతర ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని యువత ఎలాగైనా ఉద్యోగాలు సాధించాలన్న తపనతో, కసితో పట్టుదలతో శిక్షణ పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేసి వారు కొలువులు సంపాదించేలా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిష్ణాతులైన అధ్యాపకులు, నిపుణుల ద్వారా ఉద్యోగార్థులకు ఒకవైపు శిక్షణ ఇస్తుండగా, తన వంతు ఉడతా భక్తిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి అన్ని జిల్లాలను తిరిగి యువతకు తనదైన శైలిలో స్ఫూర్తినిస్తూ ఉద్యోగాలు పొందేందుకు ఆచరించాల్సిన పద్ధతులు, సూచనలు,సలహాలు, పోటీ పరీక్షలకు ఎలా సంసిద్ధం కావాలో తెలియజేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. ఇప్పటివరకు ఆయన నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ తదితర జిల్లాలో ఆయన ఉద్యోగార్థులకు ప్రేరణ ఇచ్చారు.
మహబూబ్‌ నగర్‌ జిల్లాలో గ్రూప్స్‌, ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగులకు శిక్షణ పొందుతున్న సుమారు 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులను ఉద్దేశించి సుదర్శన్‌ కన్వెన్షన్‌ లో ఏర్పాటు చేసిన ప్రేరణ తరగతులకు సి.పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులలో ఆత్మస్థైర్యాన్ని, ప్రేరణను పెంపొందించారు. స్వయంగా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో తెలుగు మీడియంలోనే చదివి ఉద్యోగం సాధించి ఐ ఏ ఎస్‌ స్థాయికి చేరుకున్న స్వీయ అనుభవాన్ని ఆయన తెలియజేశారు. కష్టపడితే పోయేదేమీ లేదని వస్తే సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం వస్తుందని, లేదా మంచి జ్ఞానం వస్తుందని, నష్టం మాత్రం లేదని స్ఫూర్తి కలిగించారు. ప్రతి అభ్యర్థి వద్దకు వెళ్లి అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారికి ప్రేరణ కల్పించారు. బంగారు తెలంగాణ సాధనకు యువశక్తి ముఖ్యమని ,రాష్ట్ర దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, అలాంటి యువత పరిపాలనా రంగంలో మార్గనిర్దేశకులుగా రావాలంటే మంచి ఉన్నతమైన పదవులైన గ్రూప్‌ ఉద్యోగాలు పొందాలని, దానిద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్న ఖాళీలలో వెనుకబడిన మహబూబ్‌ నగర్‌ జిల్లా నుంచి ఎక్కువమంది నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగాలు సంపాదిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఉద్యోగం సాధించేందుకు చదువు ఒక్కటే సరిపోదని, కృషి, పట్టుదల, సరైన ప్రణాళిక అవసరమని, దృఢ సంకల్పం ఉంటే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందని తెలిపారు. ఇందుకు అభ్యర్థులు ఇష్టంతో చదవాలని, ‘‘రీడిరగ్‌, రికార్డ్‌, రివిజన్‌ ‘‘పద్ధతి అనుసరించాలని , 360 డిగ్రీల కోణంలో ప్రణాళికబద్ధంగా చదవాలన్నారు.
ఈ విడత గ్రూపు ఉద్యోగాల ఖాళీలను రాష్ట్రప్రభుత్వం కేవలం రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేయనుందని, ఇంటర్వ్యూ, సిఫారసులకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నిరుపేద అభ్యర్థులు కూడా సులభంగా ఉద్యోగం పొందేందుకు ఒక మంచి అవకాశమని చెప్పారు. ఉద్యోగం ద్వారా తన కుటుంబం అభివృద్ధి చెందడమే కాక, ప్రజలకు సేవ చేసే భాగ్యం భగవంతుడు ప్రభుత్వ ఉద్యోగం ద్వారా కల్పించాడని అన్నారు . ప్రతి ఒక్కరిలో తనకు తెలియని శక్తి, సామర్థ్యాలు ఎన్నో ఉంటాయని, వాటిని బయటకు తీసి సరైన సమయంలో వినియోగించుకున్నప్పుడే మనిషి జీవితానికి సార్థకత వస్తుందని, అందువల్ల అభ్యర్థులు నిరాశ చెందకుండా పట్టుదలతో చదివి, చదివిన అంశాలను జ్ఞప్తిలో ఉంచుకొని, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి ఉద్యోగాలు సాధించాలని తెలిపారు.
కాగా, ముందుగా రోడ్లు భవనాల అతిథి గృహం వద్ద రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, అదనపు ఎస్పీ రాములు, ఆర్డీవో కె.అనిల్‌ కుమార్‌, డీపీఆర్‌ వో యు.వెంకటేశ్వర్లు ఘనంగా స్వాగతం పలికి మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎస్‌. వెంకట రావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథిని శాలువాతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *