Warangalvoice

Partha Saradhi

తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు

  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథి
  • ఎస్సెస్సీ టాపర్లకు అవార్డుల ప్రదానం

వరంగల్ వాయిస్, నిజామాబాద్ : తెలివితేటలు ఏ ఒక్కరికే సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి పేర్కొన్నారు. తెలివితేటలకు కుల, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం చిట్ల ప్రమీల, జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి యేటా నిర్వహిస్తున్న ఆనవాయితీని పాటిస్తూ ‘ విద్యా స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహించారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ పట్టణంలోకి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థుల మనసుల్లో ఆత్మన్యూనత భావం నెలకొని అనేకమంది తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పిల్లల్లో చిన్నతనం నుంచే సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శాయశక్తుల కృషి చేయాలని హితవు పలికారు. కేవలం ఉద్యోగం, డబ్బు సంపాదన అనే కాకుండా, చదువు వల్ల సమాజంలో తగిన గౌరవం లభిస్తుందని, సమాజానికి కూడా హితం జరుగుతుందని చెప్పారు. కాగా, తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో 2008 నుంచి విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా వచ్చే ఆగస్టులో విద్యార్థుల కెరీర్ కు, పోటీ పరీక్షలలో విజయానికి దోహదపడే విధంగా హ్యాండ్ రైటింగ్ తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులు కూడా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు అనడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్సెస్సీలో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలకు చెందిన శ్రీనాథ్, కె.వరుణ్, బాలికల పాఠశాలకు చెందిన అక్షర, అశ్విత, రాంమందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన సృజన, తులసి చందన, సైదాబాద్ ఉర్దూ మీడియం జడ్పీహెచ్ ఎస్ కు చెందిన హమీదాబీ, నదియా బేగంలకు అవార్డులతో సత్కరించి ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్దీవో శ్రీనివాసులు, ఎం ఈ ఓ రాజ్ గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *