-
కెసిఆర్ జాతీయ రాజకీయాలపై సానుకూలత
-
ప్రత్యామ్నాయ రాజకీయాలపై ప్రజల్లో ఆసక్తి
వరంగల్ వాయిస్,హైదరాబాద్:
Rapid progress in Telangana దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత విధానంలో ముందుకు సాగితే మరో వందేళ్లయినా అభివృద్ధి సాధించమన్న ప్రకటన ఆలోచింపచేసేదిగా ఉంది. తాజా బడ్జెట్ చూస్తుంటే కెసిఆర్ ప్రకటన అక్షరాల నూటికి నూరుపాళ్లు నిజం. నిజానికి దేశాన్ని..ఇతర రాష్టాల్రను పోల్చిచూస్తే తెలంగాణలో తెలంగాణలో వేగవంతమైన ప్రగతి కనిపిస్తుంది. సాగునీటి రంగంతో పాటు విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పలు చూస్తున్నాం. పాఠశాలల గతిని మారుస్తున్నారు. దేశానికి కొత్త తరహా రాజకీయం అవసరమని.. ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా సానుకూలత వ్యక్తం అవుతోంది. నిజానికి 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత కూడా మన రాజ్యాంగం ద్వారా పేదలు, అతిపేదలు, ప్రజలకు మేలు కలగడం లేదు. కేవలం రాజకీయ వ్యవస్థమాత్రమే బలోపేతం అయ్యింది తప్ప ప్రజలు బలపడలేదు. ఈ క్రమంలో కేంద్ర,రాష్టాల్ర మధ్య కూడా సంబంధాలు నిర్వచించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనేక అంశాలపై రాజ్యాంగంలో స్పష్టత లేదు.నీతి ఆయోగ్ వచ్చినా దానివల్ల ఎలాంటి ఉపయోగాలు కానరావడం లేదు. అలాగే జిఎస్టీ వసూళ్లు పెరిగాయని కేంద్రం చంకలు గుద్దుకుంటున్నా దాని వల్ల ప్రజలు ఎంతగా నష్టపోతున్నారో గమనించడం లేదు. అస్పష్ట రాజ్యాంగాన్ని పదేపదే సవరించడం కాదని, దాని స్వరూపమే మార్చాలన్న డిమాండ్ సహేతుకంగానే ఉంది. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పటిష్ట రాజ్యాంగాన్ని రాసుకోవాల్సి ఉంది. సీఎం హోదాలోనే దేశం కోసం పోరాడతాడనని కెసిఆర్ మరోమారు స్పష్టం చేసాక, బిఆర్‌ఎస్‌తో గుణాత్మక మార్పు అంటూ జాతీయ పార్టీని ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం తనవంతుగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మార్పు కోసం ఏం చేయాలో అంతా చేస్తానని.. ఈ అంశంపై అందరినీ కలుపుకుని వెళ్తానని భవిష్యత్ రాజకీయాలపై కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ప్రత్యమ్నాయ రాజకీయాలకోసం చేస్తున్న కసరత్తు సాగుతోందని అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే వివిద రాష్టాల్ల్రో కెసిఆర్ పార్టీకి సానుకూలత కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత రాజకీయాల తీరు మారాల్సి ఉందన్నది నిపుణుల అభిప్రాయం గానూ ఉంది. అయితే రాజకీయ దృక్కోణంలో కాకుండా దేశ అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాల్సి ఉంది. నిజానికి ఇప్పుడున్న రాజ్యాంగం పటిష్ఠంగగానే ఉందని..కొన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది. విధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించడంతో పాటు దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఫెడరల్ వ్యవస్థలకు తూట్లు పొడుస్తూ రాష్టాల్ర హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్న విమర్శలకు కేంద్రం జవాబు ఇవ్వడం లేదు. ఇకపోతే కెసిఆర్ తాను అనుకున్నట్లుగా గుణాత్మక మార్పులకు అనుగుణంగ బిజెపికి ధీటుగా ప్రత్యామ్నాయ రాజకీయాలకు శ్రీకారం చుడతారా అన్నది చూడాలి. కెసిఆర్ ఇప్పటికే బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ధాన్యం సేకరణ మొదలు నిధుల విడుదల వరకు అన్ని అంశాల్లో పోరాడుతున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. గుజరాత్ సీఎంగా ఉండి మోదీ ప్రధాని అయ్యాక కూడా రాష్టాల్ర తీరు మారడం లేదని కేసీఆర్ గుర్తుచేశారు. మోదీ టోపీలు, పంచెలు మార్చితే అభివృద్ధి అంటామా అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిమితి పెంచే అవగాహన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లేవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నారు. ఇదే క్రమంలో బిజెపికి చెక్ పెట్టాలన్న ధోరణిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం మత పిచ్చి రేపుతూ, ప్రజల మధ్య కొట్లాటలు పెడుతూ సమాజ వాతావరణాన్ని కలుషితం చేస్తూ దేశాన్ని విభజించాలని చూస్తోందని కేసీఆర్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దేశంలో అద్భుతమైన గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇదే సందర్భంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని కూడా ఇటీవలే స్పష్టం చేశారు. ఎన్నికలకు 6 నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి తమ వద్ద బ్రహ్మాండమైన మంత్రం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల సహకారంతో పోరాడి తెలంగాణను సాధించాం.. ఇప్పుడు దేశ ప్రజల్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ బిఆర్‌ఎస్‌ను విస్తృతం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాల పై ఫోకస్ పెట్టారని అనుకోవాలి. ఈ దేశానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏం చేసిందని చర్చకు తాము సిద్ధం అని బిఆర్‌ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రబల పరివర్తన కోసం ప్రయత్నిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.దేశ ఆర్థిక పరిస్థితి సిగ్గుతో తలదించు కునేలా ఉందని, కేంద్రం జీడీపీ లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయని అన్నారు. మొత్తంగా కెసిఆర్ చేస్తున్న ప్రకటన పట్ల సానుకూలత వస్తుందా లేదా అన్నది చూడాలి.
